యువతి ఆత్మహత్య కేస్‌లో పుష్ప నటుడు అరెస్ట్.. ఏంజ‌రిగిందంటే..?!

జగదీశ్ ప్రతాప్ భండారి అంటే మనకు పెద్దగా గుర్తుకు రాకపోవచ్చు… కానీ పుష్ప సినిమాలో అల్లు అర్జున్ స్నేహితుడు అంటే ఇట్టే గుర్తుకొచ్చేస్తాడు. ఈ సినిమాలో బన్నీకి స్నేహితుడిగా నటించి మంచి పాపులారిటీని దక్కించుకున్నాడు జగదీశ్ ప్రతాప్. ఈ సినిమా అనంతరం ఈయనకి కొన్ని సినిమా అవకాశాలు సైతం వచ్చాయి. ఇక ప్రస్తుతం ఈయన ఓ వివాదంలో చిక్కుకున్నాడు.

అతనిపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయింది. అసలు వివరాల్లోకి వెళితే.. పంజాగుట్ట పరిధిలో ఉంటున్న జూనియర్ ఆర్టిస్ట్ గత నెల 29న ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ఈ క్రమంలోనే ఆ మహిళ ఆత్మహత్యకు గల కారణాలను తెలుసుకున్నారు. ఇక ఈ నేపథ్యంలో షాకింగ్ విషయాలు బయటకు వచ్చాయి. ఆత్మహత్య చేసుకున్న మహిళ గత నెల 27న ఓ వ్యక్తితో ఉంటే.. ఆమెకు తెలియకుండానే జగదీశ్ ఫోటోలు తీశాడు.

ఆ తర్వాత వాటిని చూపించి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తాను అంటూ బెదిరించాడు. దీంతో మానసిక ఒత్తిడికి గురైన ఆ మహిళ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.. అని పోలీసులు చెబుతున్నారు. కాగా ఈ కేసు గురించి తెలిసి తప్పించుకుని తిరుగుతున్న జగదీశ్ ను పోలీసులు బుధవారం అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ఇక మొత్తానికి ఆత్మహత్య చేసుకున్న అమ్మాయితో గతంలో జగదీశ్ కి పరిచయం ఉన్నట్లు వెల్లడయింది. ఇక ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో నెట్టింట వైరల్ గా మారింది.