నాగార్జున హిట్ మూవీకి `హాయ్ నాన్న‌` కాపీనా.. ఏంటి నాని ఇది..?

న్యాచుర‌ల్ స్టార్ నాని త్వ‌ర‌లోనే `హాయ్ నాన్న‌` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. శౌర్యువ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న ఫీల్ గుడ్ ల‌వ్ అండ్ ఫ్యామిలీ ఎంట‌ర్టైన‌ర్ ఇది. ఈ సినిమాతో సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా న‌టిస్తోంది. కియారా ఖన్నా, జ‌య‌రామ్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషిస్తున్నారు. శృతి హాస‌న్ గెస్ట్ రోల్ ప్లే చేస్తోంది. వైర ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై మోహన్ చెరుకూరి, విజయేందర్ రెడ్డి తీగల ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ఆల్మోస్ట్ షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం డిసెంబ‌ర్ 7న తెలుగు, త‌మిళ్, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ‌, హిందీ భాష‌ల్లో విడుద‌ల కాబోతోంది. రీసెంట‌ర్ గా బ‌య‌ట‌కు వ‌చ్చిన హాయ్ నాన్న టీజ‌ర్ కు అదిరిపోయే రెస్పాన్స్ వ‌చ్చింది. అయితే ఇప్పుడు ఈ సినిమాపై ఓ కొత్త ప్ర‌చారం మొద‌లైంది. నాగార్జున హిట్ మూవీకి హాయ్ నాన్న కాపీ అంటూ టాక్ న‌డుస్తోంది. 2002లో నాగార్జున హీరోగా దశరధ్ తెర‌కెక్కించిన సంతోషం సినిమా, హాయ్ నాన్న స్టోరీ ఒకేలా ఉన్నాయని అంటున్నారు.

సంతోషం మూవీలో నాగార్జున‌ మొద‌ట గ్రేసీ సింగ్ తో ప్రేమలో ప‌డి పెళ్లి చేసుకోగా.. వారికి ఒక బాబు పుడ‌తాడు. బాబు పుట్టిన త‌ర్వాత గ్రేసీ సింగ్ చ‌నిపోతుంది. ఆ త‌ర్వాత నాగార్జున‌కు, బాబుకు శ్రియా ద‌గ్గ‌ర‌వుతుంది. ఇంత‌లోనే శ్రియాకు మ‌రొక‌రితో పెళ్లి ఫిక్స్ అవ్వ‌డం.. నాగార్జున‌తో ఎడ‌బాటు.. చివ‌ర‌కు ఇద్ద‌రూ క‌లిసిపోవ‌డంతో శుభం కార్డు ప‌డుతుంది.

ఇక టీజ‌ర్ గ‌మ‌నిస్తే హాయ్ నాన్న స్టోరీ కూడా ఇంచుమించు ఇలానే ఉంది. నాని కూతురుతో హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తుండ‌గా.. మృణాల్ వస్తుంది. వీళ్లిద్దరికీ బాగా దగ్గరవుతుంది. నాని, మృణాల్ ద‌గ్గ‌ర‌య్యేలోపు.. మ‌రొక‌రితో ఆమెకు పెళ్లి ఫిక్స్ అయిన‌ట్లు టీజ‌ర్ చూపించారు. అలాగే శృతి హాసన్ క్యారెక్టర్ గెస్ట్ అప్పీరెన్స్ ఉండటంతో నాని భార్యగా, చనిపోయే క్యారెక్టర్ లో చూపిస్తారేమో అని భావిస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే హాయ్ నాన్న‌, సంతోషం స్టోరీ ఒకటే అంటూ ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రి ఈ విష‌యంపై నాని అండ్ మూవీ టీమ్ ఎలా స్పందిస్తుందో చూడాలి.