అప్పుడు నిహారిక‌.. ఇప్పుడు లావ‌ణ్య‌.. ఆ విష‌యంలో ఆడ‌ప‌డుచును ఫాలో అవుతున్న మెగా కోడ‌లు!

సొట్ట బుగ్గల సుందరి లావణ్య త్రిపాఠి మరో రెండు రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కబోతున్న సంగతి తెలిసిందే. ప్రియస‌ఖుడు వరుణ్ తేజ్ తో లావణ్య ఏడడుగులు వేయబోతోంది. గత కొన్ని ఏళ్ల నుంచి ప్రేమించుకుంటున్న ఈ టాలీవుడ్ లవ్ బ‌ర్డ్స్‌ ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోబోతున్నారు. ఇప్పటికే ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితులు ఇటలీ చేరుకున్నారు.

 

నవంబరు 1న వివాహం కాగా.. ముందు కాక్ టెయిల్ పార్టీ, హల్దీ, మెహందీ, సంగీత్‌ వంటి వేడుకలను నిర్వహించబోతున్నారు. అయితే ఓ విష‌యంలో లావణ్య త్రిపాఠి త‌న‌ ఆడ‌ప‌డుచు అయిన నిహారిక‌ను ఫాలో అవుతోంది. త‌ల్లి పెళ్లి చీర‌ను నిహారిక త‌న హల్దీ ఫంక్షన్ స‌మ‌యంలో కట్టుకున్న సంగ‌తి తెలిసిందే. ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా అప్ప‌ట్లో వైర‌ల్ అయ్యాయి.

అయితే ఇప్పుడు లావ‌ణ్య కూడా అదే చేయ‌బోతోంద‌ట‌. త‌ల్లి పెళ్లి దుస్తుల‌ను లావ‌ణ్య త‌న‌ హాల్దీ ఫంక్షన్ లో ధరించబోతోందని సమాచారం. త‌ల్లి దుస్తులకు ప్ర‌ముఖ డిజైన‌ర్ చేత కొన్ని మెరుగులు దిద్దించుకుని వేసుకోబోతంద‌ట‌. ప్ర‌స్తుతం ఈ న్యూస్ నెట్టింట వైర‌ల్ గా మారింది. కాగా, ఇట‌లీలోని టుస్కానీలో వ‌రుణ్ తేజ్‌-లావ‌ణ్య త్రిపాఠి ఒక‌టి కాబోతున్నారు. పెళ్లి అనంతరం నవంబర్ 5న హైదరాబాద్ లో వీరి రిసెప్ష‌న్ వేడుక గ్రాండ్ గా జ‌ర‌గ‌బోతోంది.