మరో గొప్ప పనికి శ్రీకారం చుట్టిన‌ లారెన్స్.. అస‌లైన హీరో నువ్వే సామీ!

న‌టుడు రాఘ‌వ లారెన్స్ రీల్ లైఫ్‌ లోనే కాదు రియ‌ల్ లైఫ్ లోనూ హీరోనే. `దైవం మనుష్య రూపేణా’ అన్న ప‌దానికి లారెన్స్ నిద‌ర్శ‌నం అన‌డంలో సందేహ‌మే లేదు. డ్యాన్స్ కొరియోగ్రాఫర్ గా, న‌టుడిగా, ద‌ర్శకుడిగా, సంగీత ద‌ర్శ‌కుడిగా త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన ఇమేజ్ ను సంపాదించుకున్న లారెన్స్‌.. సేవ గుణంలోనూ గొప్ప మ‌న‌సును చాటుకున్నాడు. ఇప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేపట్టారు. ఎంతో మంది పిల్లలకు తన ఫౌండేషన్ తరపున గుండె చికిత్స చేయించారు.

ఎంద‌రో అనాథలకు ఆశ్రయం కలిపించారు. తాజాగా పేద ప్ర‌జ‌ల కోసం మ‌రో గొప్ప ప‌నికి శ్రీ‌కారం చుట్టారు. తాజాగా చెన్నైలోని ఓ ప్రాంతంలో ఆర్థిక సమస్యలతో ఇబ్బందిపడుతున్న‌ పేదలు, పేద విద్యార్థుల ఇంటికి వెళ్లిన లారెన్స్‌.. వారి క‌ష్టాల‌ను అడిగి తెలుసుకున్నారు. అండంగా ఉంటాన‌ని భ‌రోసా ఇచ్చారు. ఇల్లు కట్టుకోవడానికి, పిల్లలు చదువుకోవడానికి, జీవనం సాగించడానికి ఆర్థిక సాయం అందించారు.

ఇందుకు సంబంధించిన వీడియోను స్వ‌యంగా సోష‌ల్ మీడియా ద్వారా పంచుకున్న లారెన్స్‌.. `ప్రజలకు సేవ చేయడం కోసం ఆ దేవుడు నన్ను ఎంచుకున్నందుకు నేను చాలా అదృష్టవంతుడిని. ఇందుకోసం మీ ఆశీస్సులు కావాలి` అని పేర్కొన్నారు. దీంతో లారెన్స్ మంచి మ‌న‌సుపై సినీ ప్రియులు, సామాన్యులు ప్ర‌శంసల వ‌ర్షం కురిపిస్తున్నారు. నువ్వు అస‌లైన హీరో సామీ అంటూ పొగిడేస్తున్నారు. కాగా, లారెన్స్ నుంచి మ‌రికొద్ది రోజుల్లో `చంద్ర‌ముఖి 2` మూవీ రాబోతోంది. పి. వాసు తెర‌కెక్కించిన ఈ చిత్రంలో కంగ‌నా ర‌నౌత్ టైటిల్ రోల్ ను ప్లే చేసింది. సెప్టెంబ‌ర్ 15న ఈ మూవీ రిలీజ్ కాబోతోంది.