సీతారామం లాంటి ప్రేమ కథలో నటించనున్న ప్రభాస్.. డైరెక్టర్ అతడే..

భారతదేశపు అతిపెద్ద సినీ హీరోలలో ఒకరిగా ప్రభాస్ రేంజ్ పెరిగింది. బాహుబలితో పాన్ ఇండియా హీరో అయిపోయాడు. అయితే ఆ తర్వాత వచ్చిన సినిమాలు నిరాశపరిచాయి. అయితే వసూళ్లు మాత్రం కొంచెం కూడా తగ్గలేదు. తెలుగు కంటే హిందీ ప్రాంతాల్లో భారీ వసూళ్లు దక్కాయి. ఇక ఈ ఏడాది వరుస సినిమాలు ఆయనవి విడుదల కానున్నాయి. అందులో సలార్ అందరినీ ఆకర్షిస్తోంది. ఇదే కాకుండా ప్రాజెక్ట్ కే (కల్కి) సినిమా కూడా చాలా అంచనాలను పెంచేస్తోంది.

ఇటీవలే దానికి సంబంధించిన గ్లింప్స్ విడుదలయ్యాయి. ఇది హాలీవుడ్ తరహా సినిమా అని అందరూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఇదే కాకుండా పలు ప్రాజెక్టులు ప్రస్తుతం ప్రభాస్ చేతుల్లో ఉన్నాయి. మారుతి దరకత్వంలో ఓ కామెడీ ఎంటర్ టైనర్ సినిమాను ప్రభాస్ చేస్తున్నాడు. ఇది కాకుండా ఓ లవ్ స్టోరీకి ప్రభాస్ ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. సీతారామం లాంటి అద్భుతమైన ప్రేమకథను తెరకెక్కించిన హను రాఘవపూడి ఇటీవల ప్రభాస్‌కు ఓ స్టోరీ చెప్పటినట్లు ఫిల్మ్ నగర్ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.

ఈ ప్రాజెక్ట్ గురించిన వివరాలు ఇంకా తెలియరాలేదు. కానీ ఇంకా పేరు పెట్టని ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుందని సినీ వర్గాలు అంటున్నాయి. హను రాఘవపూడి ఇటీవల దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, రష్మిక మందన్న నటించిన పీరియాడికల్ రొమాంటిక్ చిత్రం “సీతా రామం” రూపంలో పెద్ద బ్లాక్‌బస్టర్‌ను అందించారు. ఈ చిత్ర దర్శకుడికి ఇప్పుడు మంచి డిమాండ్ ఉంది. ఆయన గతంలో తీసిన లవ్ స్టోరీలతో కూడిన సినిమాలు ప్రేక్షకులను బాగా అలరించాయి. అయితే ప్రభాస్ హీరోగా గతంలో వచ్చిన రాధేశ్యామ్ బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టింది.

హనురాఘవపూడి మాత్రం మంచి ఫామ్‌లో ఉన్నాడు. ప్రభాస్‌తో సీతారామం లాంటి మంచి లవ్ కథాంశంతో కూడిన సినిమా తీస్తే అది ఖచ్చితంగా ప్రేక్షకాదరణ పొందుతుందనడంలో సందేహం లేదు. ఇదిలా ఉంటే ప్రభాస్ పై వరుస సినిమాలున్నాయి. సెప్టెంబర్ 28, 2023న విడుదల కానున్న ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రానున్న “సలార్”లో కనిపించనున్నారు. ఇక సైన్స్ ఫిక్షన్ మూవీ ప్రాజెక్ట్ కే 2024లో విడుదల కానుంది. దీని తర్వాత రాజా డీలక్స్, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ మూవీలు పట్టాలెక్కించనున్నాడు.