సంయుక్తకు మరో హిట్ ఖాయమా…?

ప్రస్తుతం తెలుగులో గోల్డెన్ లెగ్ హీరోయిన్ ఎవరంటే ఖచ్చితంగా అందరూ సంయుక్త మీనన్ అంటారు. ఎందుకంటే ఆమె నటించిన వరుస సినిమాలు హిట్‌గా నిలిచాయి. బాక్సాఫీసు వద్ద భారీ కలెక్షన్లను సాధించాయి. దీంతో ఆమె నటిస్తే ఆ సినిమా హిట్ ఖాయమనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ మలయాళ భామ తెలుగులో తొలిసారి భీమ్లానాయక్ సినిమాలో రానా సరసన నటించింది. ఆ సినిమా తెలుగులో హిట్ గా నిలిచింది. ఆ తర్వాత వరుస సినిమా అవకాశాలు ఆమె వద్దకు వచ్చాయి. అయితే ఆచితూచి ఆమె అందులో నటిస్తోంది. వచ్చిన అన్ని ప్రాజెక్టులను ఒప్పుకోవడం లేదు. కథ బాగుంటే వెంటనే ఓకే చెబుతోంది. చివరికి ఆ ఫలితం కనిపిస్తోంది. ఆమె నటించిన సినిమాలు హిట్ అవుతుండడంతో ఆమె గోల్డెన్ లెగ్ అని అంతా పిలుస్తున్నారు.

భీమ్లా నాయక్ తర్వాత ధనుష్ సరసన ఆమె సార్ సినిమాలో నటించింది. తమిళ, తెలుగు ఇండస్ట్రీలలో అది హిట్ గా నిలిచింది. ఆ తర్వాత మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ సరసన విరూపాక్ష సినిమాలో కనిపించింది. ఆమె నటనకు అంతా ఫిదా అయ్యారు. ఆ సినిమా భారీ వసూళ్లను దక్కించుకుంది. ప్రస్తుతం ఇదే కోవలో ఆమె కళ్యాణ్ రామ్‌తో జోడీ కట్టింది. వారిద్దరి కలయికలో డెవిల్ సినిమా రూపొందుతోంది. కళ్యాణ్ రామ్ బర్త్ డే సందర్భంగా బుధవారం ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు.

ఈ టీజర్ చూసిన తర్వాత సంయుక్త ఖాతాలో మరో హిట్ ఖాయమనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. అందులో ఆమె లుక్ కూడా అందరినీ ఆకట్టుకునేలా ఉంది. బింబిసార తర్వాత కళ్యాణ్ రామ్ కూడా మరో హిట్ అందుకుంటాడని ఖాయంగా టాక్ వినిపిస్తోంది. సంయుక్త కూడా అతడి అదృష్టానికి తోడవుతుందని, ఇద్దరికీ ఈ సినిమా కలిసి వస్తుందని సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి.