టైమ్స్‌ స్క్వేర్‌లో ఘనంగా బాలకృష్ణ బర్త్‌డే సెలబ్రేషన్స్.. దానిపై ఏకంగా 24 గంటలు ఫొటోలు ప్రదర్శన..

నట సింహం నందమూరి బాలకృష్ణ జూన్ 10వ తేదీన 63వ వసంతంలోకి అడుగు పెట్టాడు. అయితే నిన్న ఈ సీనియర్ హీరో పుట్టిన రోజు వేడుకల్ని హైదరాబాద్‌లోని బసవతారకం ఆసుపత్రిలో ఘనంగా జరుపుకున్నారు. ఈ వేడుకలలో పాల్గొన్న బాలకృష్ణ భారీ కేక్‌ కట్ చేశాడు. ఆ కేకు ముక్కలను చిన్నారులకు తినిపించి తన సహృదయాన్ని చాటుకున్నాడు. అంతేకాదు బహుమతులను కూడా అందజేసి పిల్లలను సంతోషపెట్టాడు. నిజానికి బాలయ్య ఏటా తన పుట్టినరోజు వేడుకలను బసవతారకం క్యాన్సర్‌ ఆసుపత్రిలో జరుపుకుంటారు. ఈసారి కూడా అలానే చేశారు.

పేదల కోసమే తన నాన్న గారు ఎన్టీఆర్‌ బసవతారకం క్యాన్సర్‌ ఆసుపత్రిని ప్రారంభించారని.. ఇప్పుడు అదే ఆసుపత్రి దేశంలో రెండో గొప్ప ఆసుపత్రిగా అవతరించడం చాలా ఆనందంగా ఉందని బాలకృష్ణ అన్నాడు. నిస్వార్థంగా పని చేద్దామని ఈ సందర్భంగా నొక్కి చెప్పాడు. పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఎల్లవేళలా కృషి చేస్తానని హామీ ఇచ్చాడు.

ఇక నిన్న అంటే శనివారం బాలకృష్ణ బర్త్‌డే సందర్భంగా తెలుగు రాష్ట్రాలతో పాటు విదేశాల్లో కూడా గ్రాండ్‌గా జన్మదిన వేడుకలు నిర్వహించారు. ముఖ్యంగా యూఎస్‌లోని టైమ్స్‌ స్క్వేర్‌లో బాలకృష్ణ ఫ్యాన్స్ ఈ హీరో బర్త్‌డేను అట్టహాసంగా సెలబ్రేట్ చేశారు. అలానే బిల్ బోర్డ్‌పై బాలకృష్ణ సీన్స్‌, ఫోటోలు డిస్‌ప్లే చేసి వావ్ అనిపించారు. బాలయ్య ఫోటోలు ఏకంగా 24 గంటల పాటు ప్రదర్శనకు ఉంచి తమ అభిమానాన్ని చాటుకున్నారు. కేక్‌ కట్‌ చేసి.. జై బాలయ్య అంటూ నినాదాలతో చేస్తూ హోరెత్తించారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో బాలయ్య వీరాభిమానులు పండగ వాతావరణం సృష్టించారు.