ప‌దేళ్ల వైవాహిక బంధానికి బ్రేక్‌.. ప్రేమ భ‌ర్త‌తో విడిపోవ‌డానికి కార‌ణం తెలుసా?

కన్నడ, తెలుగు, తమిళం, మలయాళ భాష‌ల ప్రేక్ష‌కుల‌కు న‌టి ప్రేమ సుప‌రిచిత‌మే. భాష ఏదేనా త‌న‌దైన టాలెంట్ తో త‌క్కువ స‌మ‌యంలో మంచి గుర్తింపు సంపాదించుకుంది. అందం, అభిన‌యం, న‌ట‌నా ప్ర‌తిభ‌తో ప్రేక్ష‌కుల‌కు చేర‌వైంది. తెలుగులో కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన `దేవి` సినిమాతో ప్రేమ‌కు భారీ ఇమేజ్ ద‌క్కింది.

హీరోయిన్ గా సౌత్ లో ఓ వెలుగు వెలిగిన ప్రేమ‌.. గ‌త కొన్నేళ్ల నుంచి సినిమాల‌కు దూరంగా ఉంటోంది. 2010 త‌ర్వాత ఆమె వెండితెర‌పై క‌నిపించ‌లేదు. ప్రేమ వ్య‌క్తిగ‌త జీవితం విష‌యానికి వ‌స్తే.. ఆమె 2006లో ప్రముఖ వ్యాపారవెత్త జీవన్ అప్పచును వివాహం చేసుకుంది. పెళ్లి అయిన కొన్నేళ్ల‌కే సినిమాలు వ‌దిలేసిన ప్రేమ‌.. సంపూర్ణ గృహిణిగా మారింది. అయితే జీవన్ తో ప్రేమ ఎక్కువ కాలం క‌లిసి ఉండ‌లేక‌పోయింది. 2016లో భర్త నుంచి విడాకులు తీసుకుని..ప‌దేళ్ల వైవాహిక బంధానికి బ్రేక్ వేసింది.

అయితే తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న ప్రేమ‌.. విడాకుల గురించి ప్ర‌స్తావించింది. `నా జీవితంలో వ్యక్తిగత జీవితాన్ని ప్రొఫేషనల్ లైఫ్ లోకి తీసుకురాను. నాకు నచ్చలేదంటే దాన్ని పూర్తిగా ఖండిస్తాను. నా వైవాహిక జీవితంలో కూడా అదే జరిగింది. వ్య‌క్తిగ‌త విభేదాల కార‌ణంగా విడాకులు తీసుకున్నాను. ఆ టైమ్ లో చాలా మంది సూసైడ్ చేసుకోవాలని ఆలోచిస్తుంటారు. కానీ నేను అలా కాదు. పెళ్లనేదే జీవితం కాద‌ని న‌మ్మాను. న‌న్ను నేను స్ట్రోంగ్ గా మార్చుకున్నాను. ఇక నాకు రెండో పెళ్లి ఆలోచ‌న కూడా లేదు` అంటూ ప్రేమ చెప్పుకొచ్చింది.