ప్రభాస్ సినిమాలో నటించనున్న సంజయ్‌దత్.. కళ్లు చెదిరే పారితోషికం

బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఏ పాత్రలో నటించినా దానికి ఓ ప్రత్యేకత తీసుకొస్తాడు. కొన్నాళ్లుగా మళ్లీ విలన్ పాత్రల్లో ఆయన నటిస్తున్నాడు. కేవలం బాలీవుడ్‌లోనే కాకుండా టాలీవుడ్, కోలీవుడ్, శాండల్ వుడ్‌లలో సైతం స్టార్ హీరోల సినిమాలలో విలన్ పాత్రలను పోషిస్తున్నాడు. తెరపై హీరోలకు ధీటుగా నటిస్తూ సినిమాలకు ప్రత్యేకమైన హైప్ తీసుకొస్తున్నాడు. గతేడాది విడుదలైన కేజీఎఫ్-2లో సంజయ్ దత్ పోషించిన విలన్ పాత్ర థియేటర్లలో ఈలలు వేయించింది. తర్వాత తలపతి విజయ్ హీరోగా వస్తున్న లియో చిత్రంలో విలన్‌గా ఆయన చేస్తున్నాడు. ఇదే కోవలో స్టార్ హీరో ప్రభాస్ సరసన నటించడానికి ఆయన ఒప్పుకున్నాడు. మారుతి దర్శకత్వంలో రూపొందనున్న సినిమాలో సంజయ్ దత్ నటించనున్నాడు. అయితే ఇందులో ఆయన విలన్ పాత్ర పోషించనున్నాడా, లేక పాజిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర పోషిస్తాడా అనే సస్పెన్స్‌గా మారింది.

ప్రభాస్, మాళవిక మోహనన్ జంటగా నటించిన ఈ సినిమా మూడు షెడ్యూల్‌లు ఇప్పటికే పూర్తి అయ్యాయి. తాజాగా ఇందులో సంజయ్ దత్ కూడా జాయిన్ అయ్యారు. ఈ సినిమా కోసం సంజయ్ దత్‌కు భారీగా రెమ్యూనరేషన్ అందిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు మొత్తంగా రూ.7 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ అందుకున్నట్లు సమాచారం. హీరో తర్వాత సినిమా నటుల్లో ఆ స్థాయిలో అందుకోవడం అంటే సామాన్య విషయం కాదు. ఈ సినిమాలో సంజయ్ దత్ కూడా ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నాడు.


సంజయ్ దత్‌ను హీరో ప్రభాస్ తాత పాత్రలో కనిపిస్తాడని సినీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. ఇదే నిజమైతే వృద్ధుడి పాత్రలో, ప్రభాస్ తాతగా సంజయ్ దత్ మెప్పించనున్నాడు. ఏప్రిల్ చివరిలో సంజయ్ దత్, ప్రభాస్ మధ్య జరిగే సన్నివేశాలకు సంబంధించి సినిమా షూటింగ్ జరగనుంది. విభిన్న పాత్రల్లో, ముఖ్యంగా సీరియస్ రోల్స్ పోషించిన సంజయ్ దత్ ఈ సినిమాలో ఎలా కనిపిస్తాడోనని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.