చిత్ర పరిశ్రమ అంటేనే ఎవరికైనా ఎంతో ఇష్టం ఉంటుంది. సినిమా స్టార్స్ అంటే కూడా ఎంతో అభిమానం కూడా ఉంటుంది. సాధారణంగా సామాన్య ప్రజలు హీరోలను అభిమానించడం ఒక ఎత్తైతే సెలబ్రిటీలే తమ తోటి నటులను కూడా అభిమానిస్తూ ఉంటారు. అలా మన తెలుగు చిత్ర పరిశ్రమలో తమకు ఇష్టమైన నటుల పేర్లను కూడా తమ పిల్లలకు పెట్టుకున్న కొందరు స్టార్స్ ఉన్నారు. వారు ఎవరో ఇప్పుడు చూద్దాం.
శ్రీదేవి :
శ్రీదేవి అనే పేరు ఎంతటి పాపులర్ పేరు అనే విషయం మన అందరికీ తెలిసిందే. శ్రీదేవిని ఒక అందాల దేవతగా ఊహించుకునేవారు. అంతటి అందాల దేవత ప్రస్తుతం మన మధ్యలో లేకపోయినా ఆమె పేరును కొంతమంది తమ పిల్లలకు పెట్టుకున్నారు. గత సంవత్సరం వచ్చిన బింబిసారా సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ గా టాలీవుడ్ కి పరిచయమైన చిన్నారి శ్రీదేవి. అలనాటి శ్రీదేవి పైన ఇష్టంతోనే తమ కుమార్తెకు ఆ పేరు పెట్టుకున్నాము అని చెప్తున్నారు శ్రీదేవి తల్లిదండ్రులు.
ఇక అలాగే అలనాటి స్టార్ హీరోయిన్ మంజుల మరియు విజయ్ కుమార్‌ల మూడో కుమార్తె పేరు కూడా శ్రీదేవి. శ్రీదేవి-మంజుల ఎంతో మంచి స్నేహితులు. అలాగే మంజుల- విజయ్ కుమార్ కుటుంబంతో శ్రీదేవికి కూడా ఎంతో మంచి సాన్నిహిత్యం ఉంది. వీరి కుటుంబాల్లో జరిగిన ఏ వివాహానికైనా కూడా ఈ రెండు కుటుంబాలు కలిసే దగ్గరుండి చేసుకుంటారు. అందుకే తనకు మూడవ కుమార్తె పుట్టినప్పుడు మంజుల ఆ పాపకు శ్రీదేవి పేరునే పెట్టుకుంది. అలా మంజుల శ్రీదేవిపై తనకు ఉన్న ఇష్టాన్ని చూపించింది.
జూనియర్ ఎన్టీఆర్ :
జూనియర్ ఎన్టీఆర్ అంటే చాలామందికి అభిమానం ఉంటుంది. సీనియర్ నటి రాధిక కు తారక్ అంటే అమితమైన ఇష్టం. ఎంతటి ఇష్టమంటే ఏకంగా తన కొడుకు కి కూడా తారక్ పేరునే పెట్టుకుంది. ఇటీవల ఈ విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో వెల్లడించింది రాధిక. కేవలం తారక్ పై ఉన్న అభిమానంతోనే తన కొడుకుకి ఆ పేరు పెట్టుకున్నారని తనకు తారక్ అంటే ఎంతో ఇష్టం అంటూ తన అభిమానాన్ని చాటుకుంది. సీనియర్ ఎన్టీఆర్ పై ఉన్న గౌరవంతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన కొడుకుకి తారక రామారావు అని పేరు పెట్టారు.
పవన్ కళ్యాణ్ :
ఇక పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. పవన్‌కు రెండు తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయన పేరు చెప్తే చాలు యువత నిద్రలో నుంచి లేచి కూర్చుంటారు. అయితే కేవలం అబ్బాయిలే కాదు, అమ్మాయిల్లో కూడా పవన్ కళ్యాణ్ అంటే క్రేజ్ ఎంతో ఉంటుంది. బిగ్ బాస్ ఓటిటి షోలో పాల్గొన్న స్రవంతి చొక్కారపు మీకు గుర్తుండే ఉంటుంది కదా. ఆమె పవన్ కళ్యాణ్ అభిమాని. అందుకే ఏకంగా పవన్ కళ్యాణ్ కొడుకు అకిరా పేరును తన కొడుకుకి పెట్టుకుంది.