‘మంచు’ వారింట్లో తగ్గని గొడవలు.. అక్కతోనూ విష్ణుకు విభేదాలా?

టాలీవుడ్‌లో మంచు ఫ్యామిలీని వరుస వివాదాలు వెంటాడుతున్నాయి. ఇటీవల మంచు విష్ణు తన తమ్ముడు మంచు మనోజ్‌తో పెట్టుకున్న గొడవకు సంబంధించిన వీడియో విపరీతంగా వైరల్ అయింది. అయితే ఇది ఓ రియాలిటీ షో‌కు సంబంధించినదని వారు కవర్ చేశారు. అయినప్పటికీ మంచు ఫ్యామిలీలో విభేదాలున్నాయనే విషయం స్పష్టం అయింది. ముఖ్యంగా మంచు విష్ణు వ్యవహార శైలి చాలా మందికి నచ్చడం లేదు.

ముఖ్యంగా ‘మా’ ఎలక్షన్‌లో వారు గెలిచినప్పటికీ ఇతర నటుల పట్ల ఆగ్రహం వ్యక్తం చేయడం, విమర్శలు చేయడం వివాదాస్పదమైంది. ‘మా’ అసోసియేషన్‌కు ఒక బిల్డింగ్ కడతామని హామీనిచ్చినా, నేటికీ అది నెరవేరలేదు. మరో వైపు ఇంట్లోనూ కుటుంబ సభ్యులతో విష్ణు గొడవలు పెట్టుకుంటున్నాడు. తమ్ముడు మనోజ్ రెండో పెళ్లి చేసుకుంటున్న సమయంలో ఏదో గెస్ట్‌లాగా వచ్చి వెళ్లిపోయాడు.

అయితే తమ్ముడితో పాటు సోదరితోనూ ఆయనకు విభేదాలున్నాయనే వార్తలు ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో గుప్పుమంటున్నాయి. తమ మీద వచ్చిన ట్రోల్స్‌ను మంచు మోహన్ బాబు, లక్ష్మీ, మనోజ్ పట్టించుకోరు. వాటిని ఎంజాయ్ చేస్తారు. కానీ విష్ణు మాత్రం అలా కాదు. ట్రోలింగ్ చేసే వారిపై పోలీస్ కేస్ పెడతానని బెదిరిస్తుంటాడు. దీంతో ఎక్కడ ఆయన దొరికినా ఆ విషయంలో ట్రోలింగ్ చేస్తుంటారు. తాజాగా తన సోదరితో ఆయనకు సఖ్యత లేదన్న విషయం స్పష్టం అయింది. ఇటీవల మనోజ్-భూమా మౌనిక పెళ్లిని తన ఇంట్లోనే మంచు లక్ష్మి నిర్వహించింది. ఆ తర్వాత తన బర్త్‌ డే కూడా అందరినీ ఆహ్వానించింది. ఆ ఫంక్షన్‌కు పలు రకాల ఆహార పదార్థాలు వండి అతిథులకు వడ్డించింది. చాలా మంది కుటుంబ సభ్యులు, సన్నిహితులు హాజరయ్యారు. కానీ మంచు విష్ణు హాజరు కాలేదు.

దీంతో అక్కతో కూడా అతడికి చెడిందనే వార్తలు గుప్పుమంటున్నాయి. క్రమశిక్షణకు తాను అత్యంత ప్రాధాన్యత ఇస్తానని మోహన్ బాబు పలు సందర్భాల్లో పేర్కొన్నారు. కానీ సొంత కుటుంబ సభ్యులే క్రమశిక్షణగా ఉండడం లేదని అంతా చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా ఇటీవల జరిగిన ఘటనలు మంచు విష్ణును మరిన్ని వివాదాల్లోకి నెట్టాయి.