సినిమాల్లోకి రాకుంటే ప్ర‌భాస్ అలా అయ్యేవాడ‌ట‌.. తెలుసా?

ప్రభాస్.. ఈ పేరు తెలియని సినీప్రియలు ఉండరు. భారీ సినీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నటువంటి ఫ్యామిలీ నుంచి వచ్చినప్పటికీ తనదైన టాలెంట్ తో అంచలంచ‌లుగా ఎదుగుతూ స్టార్ హోదాను అందుకున్నాడు. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారి విపరీతమైన ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు. బాహుబలి తర్వాత ప్రభాస్ నుంచి వచ్చిన సాహో రాధేశ్యామ్‌ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి.

అయినా సరే ప్రభాస్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఆయనతో సినిమాలు చేసేందుకు సౌత్ తో పాటు నార్త్ దర్శక నిర్మాతలు సైతం పోటీ పడుతున్నారు. అటువంటి ప్రభాస్ సినిమాల్లోకి రాకపోయి ఉంటే ఎలా ఉండేది. అమ్మో.. ఆ ఊహ‌నే ఊహించలేం. కానీ నిజానికి ప్రభాస్ సినిమాల్లోకి రావాలని అనుకోలేదట. ప్రభాస్ తన చిన్నతనం నుంచి వ్యాపారం చేయాలని కలలు కనే వాడట. ముఖ్యంగా హోటల్ బిజినెస్ పై ఎక్కువ ఆసక్తి ఉండేదట.

ఇటీవల ప్రభాస్ స్వయంగా ఈ విష‌యాన్ని వెల్లడించాడు. `చిన్నతనం నుంచి ఏదైనా వ్యాపారం చేయాలని ఆస‌క్తి ఉండేది. నేను మంచి ఫుడ్డీ కాబట్టి హోటల్ బిజినెస్ చేయాలని అనుకున్నాను. కానీ అప్పుడు మా ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. అందువల్లే నేను అనుకున్న వ్యాపారం చేయలేకపోయాను. ఆ తర్వాత సినిమా రంగంలోకి వచ్చేశాను` అంటూ ప్రభాస్ చెప్పుకొచ్చాడు. మొత్తానికి సినిమాల్లోకి రాకపోయుంటే తాను ఒక బిజినెస్ మాన్ అయ్యుండేవాడినని ప్రభాస్ పేర్కొన్నాడు.