నా పొరపాటును మన్నించండి.. క్షమాపణలు చెబుతున్న నందమూరి బాలకృష్ణ..!

ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ తాజాగా చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి. ఈ క్రమంలోనే తనపై వస్తున్న కామెంట్స్ పై బాలకృష్ణ స్పందించడం జరిగింది. తాజాగా తాను నటించిన వీరసింహారెడ్డి సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న బాలకృష్ణ మాట్లాడుతూ.. దేవ బ్రాహ్మణులకు దేవల మహర్షి గురువు.. దేవల మహర్షికి నాయకుడు ఆ రావణాసురుడు అని చెప్పారు. అయితే బాలకృష్ణ వ్యాఖ్యలను దేవాంగ కులస్తులు తప్పుపడుతున్నారు. ఈ క్రమంలోనే బాలకృష్ణ తన వ్యాఖ్యలపై స్పందించారు.

దేవ బ్రాహ్మణులకు నాయకుడు రావణబ్రహ్మ అనేది తప్పుడు సమాచారం అని అన్నారు. అది దురదృష్టవశాత్తు ఆ సందర్భంలో అలవోకగా వచ్చిన మాట మాత్రమేనని తెలిపారు. తన పొరపాటును మన్నిస్తారని ఆశిస్తున్నట్లుగా కూడా కోరారు. అంతేకాదు దేవ బ్రాహ్మణులకు క్షమాపణలు కూడా చెబుతూ ఒక ప్రకటన విడుదల చేశారు. ” దేవ బ్రాహ్మణ సోదర సోదరీమణులకు మీ సోదరుడు నందమూరి బాలకృష్ణ మనః పూర్వక మనవి.. దేవ బ్రాహ్మణులకు నాయకుడు రావణబ్రహ్మ అని.. నాకు అందిన సమాచారం తప్పు అని నాకు తెలియజెప్పిన దేవ బ్రాహ్మణ పెద్దలందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.

నేను అన్న మాటల వల్ల దేవాంగుల మనోభావాలు దెబ్బతిన్నాయని తెలిసి.. ఇప్పుడు చాలా బాధపడుతున్నాను. నాకు ఎవరిని బాధ పెట్టాలన్న ఆలోచన లేదు.. ఉండదు అని.. తెలుగు ప్రజలందరికీ తెలుసు.. దురదృష్టవశాత్తు ఆ సందర్భంలో అలవోకగా వచ్చిన మాట మాత్రమే అది. అంతేకానీ సాటి సోదరుల మనసు గాయపరచడం వల్ల నాకు కలిగే ప్రయోజనం ఏముంటుంది? పైగా దేవాంగులలో నా అభిమానులు చాలామంది ఉన్నారు. నా వాళ్లను నేను బాధ పెడతానా? దయచేసి అర్థం చేసుకోండి.. క్షమించండి. అంటూ బాలకృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు.