ఆ హీరోతో మళ్లీ రొమాన్స్ చేసేందుకు సిద్ధమైన అలియా భట్..

ఆర్ఆర్ఆర్ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైంది బాలీవుడ్ బబ్లీ గర్ల్ అలియా భట్. ఈ ముద్దుగుమ్మ చేతిలో ప్రస్తుతం రెండు సినిమాలు ఉన్నాయి. కాగా తాజాగా ఆమె మరో సినిమా చేయబోతుందని బాలీవుడ్ మీడియా పేర్కొంది. అయితే ఈ వీడియో సినిమా కోసం ఆల్రెడీ మూడు సార్లు కలిసి నటించిన హీరోతో ఆమె జతకట్టనుంది. అతడే బద్లాపూర్ యాక్టర్ వరుణ్ ధావన్. బాలీవుడ్ సినిమాల్లో ఈ జంట కి ఫుల్ క్రేజ్ ఉంది. అలియా భట్ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్‌లో తొలిసారిగా వరుణ్ తో రొమాన్స్ చేసింది. ఆపై శశాంక్ ఖైతాన్ డైరెక్ట్ చేసిన ‘హంప్టీ శర్మ కీ దుల్హనియా’, ‘బద్రీనాథ్ కి దుల్హనియా’ వంటి రెండు బ్లాక్‌బస్టర్‌ సినిమాలలో అతనితో కలిసి నటించింది.

దుల్హనియా ఫ్రాంచైజీ మొదటి భాగం 2014లో విడుదలైంది. రెండవది మూడేళ్ల తర్వాత విడుదలైంది. ఈ ఫ్రాంచైజీలో మూడవ సినిమా చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని టాక్. ఈ దుల్హనియా ఫ్రాంచైజీ కరణ్ జోహార్, వరుణ్, అలియా, శశాంక్‌లకు చాలా ప్రత్యేకమైనదని చెప్పొచ్చు. ఈ టీమ్ పార్ట్ 3 చేసేందుకు తమలో తాము చర్చించుకున్నారట. అయితే, వారు ఇంకా స్క్రిప్ట్‌ను లాక్ చేయలేదని సమాచారం. మొదటి రెండు పార్ట్‌ల మాదిరిగానే, మూడవ మూవీ కూడా రొమాన్స్, ఇన్నోసెన్స్‌ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉంటాయని వినికిడి.

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో హీరో వరుణ్ మళ్లీ అలియాతో కలిసి పనిచేయాలనుకుంటున్నానని, భవిష్యత్తులో అది జరగవచ్చని చెప్పాడు. “అలియా నా మనసుకు చాలా దగ్గరైన వ్యక్తి. మా మధ్య కెమిస్ట్రీ బాగుంటుంది. మేం మంచి స్నేహితులం. ఒకరినొకరు రెస్పెక్ట్ ఇచ్చి పుచ్చుకుంటాం. నిజానికి ఆలియాతో మళ్లీ కలిసి పనిచేయాలని అనుకుంటున్నాను. భవిష్యత్తులో అది జరుగుతుందని నేను భావిస్తున్నాను, ” అని వరుణ్ చెప్పాడు. ఒకే హీరోతో నాలుగుసార్లు అలియా జత కడితే మాత్రం అది ఇద్దరి కెరీర్స్‌లో రికార్డుగా మిగులుతుంది.