మగధీరకు పదిరెట్లుగా హరిహర వీరమల్లు!

టాలీవుడ్ స్టార్ హీరోలు చేసే సినిమాల్లో ఏదో ఒక యాక్షన్ సీక్వెన్స్ ఆ సినిమాకే హైలైట్‌గా ఉండటం మనం చూస్తుంటాం. ఉదాహరణకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘మగధీర’ చిత్రంలో వంద మందితో ఫైట్ సీక్వెన్స్, ఆ సినిమాకే హైలైట్‌గా నిలిచింది. అయితే ఇప్పుడు అంతకు పదిరెట్లు ఎక్కువగా ఉండే యాక్షన్‌ను చూపించబోతున్నాడు పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్. దర్శకుడు క్రిష్ డైరెక్షన్‌లో పవన్ నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమా కోసం పవన్ తెగ శ్రమిస్తున్నాడు.

ఇప్పటికే చాలా ఆలస్యమవుతున్న ఈ సినిమా కోసం పవన్ ఈసారి బల్క్ డేట్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక పవన్ కెరీర్‌లో తొలిసారి పాన్ ఇండియా మూవీగా రాబోతున్న ఈ సినిమా కోసం పవన్ చాలా కష్టపడుతున్నాడు. ఇటీవల ఆయన ఈ సినిమా సెట్స్‌లో ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ కోసం రిహార్సెల్ చేస్తున్న ఫోటోలు బయటకు రావడంతో అవి సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే ఈ యాక్షన్ సీక్వెన్స్ మామూలుగా ఉండదని.. ఏకంగా 1000 మందితో పవన్ యుద్ధం చేయబోతున్నట్లు తెలుస్తోంది.

ఎదురుగా 1000 మంది ప్రత్యర్థులు ఉన్నా, పవన్ చేసే యాక్షన్ సీక్వెన్స్ ఈ సినిమాకే హైలైట్‌గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో రాబిన్ హుడ్ తరహా పాత్రలో పవన్ మనకు కనిపిస్తాడని చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అందాల భామ నిధి అగర్వాల్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుండగా, పలువురు పాన్ ఇండియా నటీనటులు కూడా ఇందులో నటిస్తున్నారు. ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. మరి ‘మగధీర’లో వంద మంది ఫైట్‌కే మనం ఇండస్ట్రీ హిట్ చేస్తే.. పవన్ ఏకంగా వెయ్యి మందితో యుద్ధం చేయబోతున్నాడు. మరి ఈ సినమా ఎక్కడికి వెళ్తుందో చూడాలి అంటున్నారు పవన్ అభిమానులు.