షాక్‌: చిరంజీవికి చెల్లిగా న‌య‌న‌తార‌..!

ఓ హీరోకు భార్య‌గా న‌టించిన హీరోయిన్‌.. మ‌ళ్లీ అదే హీరోయిన్‌కు చెల్లిగా న‌టించ‌డం అరుదైన సంద‌ర్భ‌మే అవుతుంది. ప్రేక్ష‌కులు ఆ కాంబినేష‌న్‌ను ఎలా రిసీవ్ చేసుకుంటార‌న్న‌ది అంచ‌నా వేయ‌లేం. అయితే ప్రేక్ష‌కుల అంచ‌నాలు త‌ల్ల‌కిందులు చేస్తూ ఎలా అయినా మెప్పించే న‌టీన‌టులు ఉంటే ఇలా భార్య‌గా, చెల్లిగా చేసినా ఇబ్బంది ఉండ‌దు. ప్ర‌తిభావంత‌మైన హీరోలు, హీరోయిన్లు ఉన్న‌ప్పుడే ఇది సాధ్యం అవుతుంది. మిస్స‌మ్మ‌, గుండ‌మ్మ క‌థ లాంటి సినిమాల్లో హీరో, హీరోయిన్లుగా న‌టించారు ఎన్టీఆర్ – సావిత్రి. వీరి కాంబినేష‌న్‌కు అప్ప‌ట్లో వెండితెర‌పై తిరుగులేని క్రేజ్ ఉండేది.

అయితే ఈ ఇద్ద‌రే ర‌క్త‌సంబంధం సినిమాలో అన్నాచెల్లిగా న‌టించారు. సోద‌రి సెంటిమెంట్ ఈ సినిమాలో గొప్ప ఉద్వేగాల‌ను పండించింది. ఇలాంటి ప్ర‌య‌త్నాలే అటు కోలీవుడ్‌లోనూ, ఇటు బాలీవుడ్‌లోనూ జ‌రిగాయి. అయితే ఇటీవ‌ల కాలంలో ఇలాంటి సంద‌ర్భాలు పెద్ద‌గా రిపీట్ కాలేదు. ఇప్పుడు ఏకంగా మెగాస్టార్ చిరంజీవి సినిమాలో ఇలాంటి అరుదైన సీన్ రిపీట్ కాబోతోంది. లేడీ సూప‌ర్‌స్టార్ న‌య‌న‌తార‌, చిరంజీవికి చెల్లిగా క‌నిపించ‌బోతోంద‌ట‌.

గ‌తంలో వీరిద్ద‌రు క‌లిసి సైరా న‌ర‌సింహారెడ్డి సినిమాలో న‌టించారు. సైరాలో చిరుకు భార్య‌గా న‌య‌న‌తార న‌టించారు. అయితే ఇప్పుడు గాడ్ ఫాద‌ర్ సినిమాలో చిరుకు న‌య‌న చెల్లి పాత్ర‌లో క‌నిపించ‌బోతోంద‌ట‌. ఓ మిస్ అండ‌ర్ స్టాండింగ్ కార‌ణంగా త‌న అన్న‌ను ప‌క్క‌న పెట్టేసే పాత్ర‌లో న‌య‌న్ న‌టిస్తోంద‌ట‌. అయితే త‌న సోద‌రి క‌ష్టాల్లో ఉంద‌న్న విష‌యం తెలుసుకున్న చిరు రంగంలోకి దిగి ఆమెను కాపాడ‌డం.. త‌ర్వాత ఇద్ద‌రూ క‌లుసుకోవ‌డం జ‌రుగుతుంద‌ట‌.

చిరు ప‌క్క‌న హీరోయిన్‌గా చేసిన న‌య‌న్‌.. ఇప్పుడు చెల్లిగా న‌టిస్తే ప్రేక్ష‌కులు ఎలా రిసీవ్ చేసుకుంటారు ? అన్న సందేహాలు ఉన్నాయి. అయితే చిరు, న‌య‌న్ ఇద్ద‌రూ కూడా న‌టనా ప‌రంగా తిరుగులేని స్టార్లే. ఇప్పుడు వీరిద్ద‌రి విష‌యంలో అలాంటి ఇబ్బందులు ఉండ‌వ‌నే సినిమా యూనిట్ చెపుతోంది. ప్రస్తుతం చిరు-నయన్ లపై హైదరాబాద్ లో సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. లూసీఫ‌ర్‌కు రీమేక్‌గా వ‌స్తోన్న ఈ సినిమాకు మోహ‌న‌రాజా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.