ట్రైలర్‌తో ‘అఖండ’ తాండవం.. గుర్తుపెట్టుకో!

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నందమూరి బాలకృష్ణ ‘అఖండ’ చిత్రం నుండి ఎట్టకేలకు ఓ సరికొత్త అప్‌డేట్ వచ్చేసింది. మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ప్రెస్టీజియస్ మూవీకి సంబంధించిన ట్రైలర్‌ను ఎప్పుడు రిలీజ్ చేస్తారా అని చిత్ర వర్గాలతో పాటు ప్రేక్షకులు సైతం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో బాలయ్య రెండు విభిన్న గెటప్స్‌లో కనిపిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి కథతో వస్తుందా అని వారు ఆతృతగా చూస్తున్నారు. ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ డేట్ అండ్ టైమ్‌ను చిత్ర యూనిట్ అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు.

‘అఖండ’ చిత్రానికి సంబంధించిన పవర్‌ప్యాక్డ్ ట్రైలర్‌ను నవంబర్ 14న రాత్రి 07:09 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ ట్రైలర్ అనౌన్స్‌మెంట్‌ను ఓ అదిరిపోయే పోస్టర్ రూపంలో తెలియజేశారు చిత్ర యూనిట్. త్రిశూలం పట్టుకున్న అఘోరాగా బాలకృష్ణ తాండవం చేస్తున్నట్లు ఈ పోస్టర్‌ను డిజైన్ చేశారు. మొత్తంగా చూస్తే ఈ పోస్టర్‌లో బాలయ్య అఖండ తాండవం చేస్తున్నాడని చెప్పాలి.

ఇక ఈ సినిమాలో బాలయ్య అఘోరాగా అదిరిపోయే పర్ఫార్మెన్స్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో బాలయ్య సరసన అందాల భామ ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటిస్తోండగా, ఈ సినిమాకు థమన్ అదిరిపోయే సంగీతాన్ని అందిస్తున్నాడు. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో చిత్ర యూనిట్ ఇంకా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. మరి అఖండ ట్రైలర్ యూట్యూబ్‌ను ఎలా దడదడలాడిస్తుందో తెలియాలంటే రేపటి వరకు ఆగక తప్పదు.