న్యాచురల్ స్టార్ నాని అంటే తెలియని వారుండరు. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకపోయినా టాలీవుడ్లో స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడీయన. అలాగే తన సహజమైన నటనతో ఎందరో ప్రేక్షకులను తన అభిమానులుగా మార్చుకున్న నానికి ఈ రోజు(సెప్టెంబర్ 5) వెరీ వెరీ స్పెషల్. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సెప్టెంబర్ 5, 2008 అంటే సరిగ్గా 13 ఏళ్ల క్రితం ఇదే రోజున ఓ చిన్న సినిమా విడుదలైంది.
అసలు విడుదలైనట్లు కూడా చాలా మందికి తెలియదు. ఎందుకంటే అందులో హీరోయిన్ మినహా మిగిలిన వారి ఫేసులు ప్రేక్షకులకు తెలియకపోవడమే. అయితే విచిత్రం ఏంటంటే చిన్న సినిమాగా రిలీజ్ అయిన ఆ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. ఇంతకీ ఆ సినిమా ఏదో కాదు..`అష్టాచమ్మా`. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంతోనే మన నాని హీరోగా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చాడు.
అప్పటి వరకు క్లాప్ డైరెక్టర్‌గా పని చేసిన నాని అష్టాచమ్మాతోనే ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. అంతేకాదు. మొదటి సినిమాలోనే తన సహజమైన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసి భారీ హిట్‌ను ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత ఒక్కో మెట్టు ఎక్కుతూ.. తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ఓ చిన్న సామ్రాజ్యాన్నే నిర్మించుకున్నాడు.