ఫ్యామిలీతో కలిసి చూడాల్సిన చిత్రం టక్ జగదీష్.. నిర్మాత ఆసక్తికర వ్యాఖ్యలు..!

సెప్టెంబర్ 10వ తేదీన వినాయక చవితి కానుకగా అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా టక్ జగదీష్ సినిమా విడుదలకానున్న విషయం తెలిసిందే. శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో నాని, రీతు వర్మ, ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రం ఓటీటీలో నేరుగా విడుదల కావడంపై సర్వత్రా విమర్శలు వచ్చాయి. కానీ చిత్రబృందం మాత్రం ఓటీటీకే ఓటు వేసింది. ఈ నేపథ్యంలోనే చిత్ర నిర్మాత సాహు గారపాటి టక్ జగదీష్ సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

“ఓటీటీలో రిలీజ్ చేస్తున్నామని ప్రకటించగానే మా పై ఎన్నో విమర్శలు వచ్చాయి. ఒక్కొక్కరు ఒక్కో సమస్య గురించి చెబుతూ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేయాలన్నారు. కానీ మాకూ సమస్యలు ఉన్నాయి. అందుకే ఓటీటీలోనే సినిమా రిలీజ్ చేయాలని నిర్ణయించాం. అదృష్టవశాత్తు సినిమా ఇండస్ట్రీ నుంచి మాకు మంచి సపోర్ట్ లభించింది. మా సమస్యలను వారు అర్థం చేసుకున్నారు. టక్ జగదీష్ సినిమా అనేది కుటుంబసభ్యులందరూ కలిసి ఎంజాయ్ చేయాల్సిన ఒక పండుగ లాంటి సినిమా. ఇంకా అన్ని ప్రదేశాల్లో పూర్తిస్థాయిలో థియేటర్లు తెరుచుకోలేదు. థర్డ్ వేవ్ వచ్చే ప్రమాదం ఉందని కూడా హెచ్చరిస్తున్నారు. ఇటువంటి పరిస్థితులలో భారీ బడ్జెట్ సినిమాని థియేటర్లలో ఎలా రిలీజ్ చేయాలంటారు? మాకు కూడా థియేటర్లలోనే విడుదల చెయ్యాలని ఉంది. కానీ పరిస్థితుల దృష్ట్యా ఓటీటీలో విడుదల చేస్తున్నాం” అని సాహు గారపాటి చెప్పుకొచ్చారు.