పాగల్ హీరోను పట్టించుకోని పబ్లిక్.. అయినా తగ్గేదే లేదట!

టాలీవుడ్‌లో ‘ఈ నగరానికి ఏమైంది?’అనే యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ మూవీతో హీరోగా పరిచయమయ్యాడు విశ్వక్ సేన్. ఈ సినిమాలో మనోడి యాక్టింగ్‌కు అప్పట్లో ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉండేది. అయితే ఆ ఫ్యాన్ బేస్‌ను మరింత పెంచుకుంటూ వరుసబెట్టి సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు ఈ హీరో. ముఖ్యంగా ‘ఫలక్‌నుమా దాస్’ లాంటి మాస్ సబ్జెక్ట్‌తో ఆడియెన్స్ పల్స్‌ను పట్టేశాడు ఈ హీరో. ఇక తనకు తిరుగే లేదని ఫీలవుతూ ఎలాంటి సబ్జెక్టునైనా ఓకే చేస్తూ ముందుకెళ్తున్నాడు. అయితే మనోడి కాన్ఫిడెన్స్ కాస్తా ఓవర్ కాన్ఫిడెన్స్‌గా మారిందని ప్రస్తుతం టాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది.

హిట్ చిత్రంతో అదిరిపోయే హిట్ అందుకున్నాక విశ్వక్ సేన్ అమాంతం స్టార్ హీరోలా ఫీలవుతున్నాడు. ఇదే కాన్ఫిడెన్స్‌తో పాగల్ అనే రొమాంటిక్ ఎంటర్‌టైనర్ సబ్జెక్టుతో తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ఈ హీరో. అయితే ఇక్కడే మనోడికి పబ్లిక్ అసలు పల్స్ ఎలా ఉంటుందో అర్థం అయ్యింది. సినిమాలో కంటెంట్ ఉంటేనే ఎంతటి హీరోకైనా విలువ ఉంటుందని, ఈ సినిమాతో ప్రూవ్ చేశారు కామన్ ఆడియెన్స్. రొటీన్ లవ్ స్టోరీని పట్టుకొచ్చి జనాలపై రుద్దడమే కాకుండా, ఈ సినిమాతో మూసుకున్న థియేటర్లు తెరుచుకుంటాయి, లేదంటే నా పేరు మార్చుకుంటా లాంటి ఓవర్ కాన్ఫిడెన్స్ మాటలు మానుకోవాలని మనోడికి సినిమా రిజల్ట్‌తో అర్థం అయ్యేలా చెప్పారు పబ్లిక్.

కానీ విశ్వక్ సేన్ మాత్రం పాగల్ చిత్రానికి అదిరిపోయే రెస్పాన్స్ ఇస్తున్నారని, థియేటర్లకు వెళ్లి మరీ ఆడియెన్స్‌కు కృతజ్ఞతలు చెబుతూ హంగామా చేస్తున్నాడు. ఏదేమైనా తాను తగ్గేదే లే అంటున్నాడు ఈ పాగల్ హీరో.. సారీ పాగల్ సినిమా హీరో. మరి ఈ హీరోకు అసలు పాగల్ చిత్రం హిట్ అయ్యిందో లేక ఫట్టుమన్నదో తెలిసిందే లేదో చూడాలి.