తెలుగు సినిమాకు ద‌ళ‌ప‌తి విజ‌య్ దిమ్మ‌తిరిగే రెమ్యున‌రేష‌న్‌?

త‌మిళ స్టార్ హీరో ద‌ళ‌ప‌తి విజ‌య్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఈయ‌న‌కు కోలీవుడ్‌లోనే కాదు..టాలీవుడ్‌లోనూ సూప‌ర్ క్రేజ్ ఉంది. ఆ క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకునే విజ‌య్ తెలుగులో ఓ సినిమా చేసేందుకు సిద్ధ‌మైన‌ట్టు గ‌త కొద్ది రోజులుగా ప్ర‌చారం జ‌రుగుతోంది.

ప్ర‌స్తుతం త‌మిళంలో నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో విజ‌య్ త‌న 65వ చిత్రాన్ని చేస్తున్నాడు. ఈ చిత్రం త‌ర్వాత తెలుగులో విజ‌య్ ఓ సినిమా చేయ‌నున్నాడు. వంశీ పైడిపల్లి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నుండ‌గా.. ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు తెలుగు, త‌మిళంతో పాటు హిందీ, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లోనూ ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను భారీ బ‌డ్జెట్‌తో నిర్మించ‌బోతున్నారు.

అయితే ఈ చిత్రానికి విజ‌య్ రెమ్యున‌రేష‌న్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. లేటెస్ట్ బ‌జ్ ప్ర‌కారం ఈ సినిమాకు విజ‌య్ రూ.90 కోట్ల వ‌ర‌కు పుచ్చుకుంటున్నార‌ని స‌మాచారం. మ‌రి ఇది ఎంత వ‌ర‌కు నిజ‌మో ప‌క్క‌న పెడితే.. ఈ వార్త కోలీవుడ్ వ‌ర్గాల్లో మాత్రం తెగ వైర‌ల్ అవుతోంది.