పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా చిత్రం `వకీల్ సాబ్`. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రంలో పవన్‌కు జోడీగా శ్రుతి హాసన్ నటించగా.. నివేదా థామస్, లావణ్య త్రిపాటి, అనన్య నాగల్ల, అంజలి ప్రధాన పాత్ర పోషించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఏప్రిల్ 9న విడుదల కానుంది.
దీంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ ప్రారంభించింది. ఇందులో భాగంగానే వకీల్ సాబ్ ట్రైలర్‌ను తాజాగా విడుదల చేయగా.. అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలను పెంచేసింది. వాస్తవానికి తక్కువ టైంలో అత్యధిక లైక్స్ సాధించిన ట్రైలర్‌గా ‘బాహుబలి 2’ ఉండేది.
బాహుబలి 2 ట్రైలర్ పది గంటల్లో 4 లక్షల లైకులు సాధించింది. అయితే తాజాగా బాహుబలి రికార్డును వకీల్ సాబ్ చిత్తు చిత్తు చేసేసింది. విడుదలైన క్షణం నుంచి కూడా రికార్డులు తిరగరాస్తుంది ఈ సినిమా ట్రైలర్. కేవలం 71 నిమిషాల్లోనే 4 లక్షల లైకులు అందుకున్న వకీల్ సాబ్ ట్రైలర్.. 250 నిముషాల్లో ఏడు లక్షల లైకులను కూడా దాటేసింది. ఈ లెక్కన చూస్తే 24 గంటలు గడిచే సమయానికి ఖచ్చితంగా పది లక్షల లైకులు దాటేస్తుందని భావిస్తున్నారు. అలాగే ఇప్పటి వరకు ఈ ట్రైలర్ 12 మిలియన్ వ్యూస్ రాబట్టి దుమ్ముదుళిపేస్తోంది.