టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై ఎప్పుడూ ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. 2009 ఎన్నికలలో టీడీపీ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎన్టీఆర్..తన ప్రసంగాలతో అదరగొట్టారు. ఇక ఆ ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇక అప్పటి నుంచి ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని తెలుగు తమ్ముళ్లతో పాటు సినీ అభిమానులు కూడా కోరుకుంటున్నారు.
కానీ, ఎన్టీఆర్ మాత్రం రాజకీయాల వైపు మొగ్గు చూపడం లేదు. వరుస సినిమాలతో బిజీ బిజీగా గడుతుపుతున్నారు. ఇలాంటి తరుణంలో టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి గోరంట్ల బుచ్చయ్య చౌదరి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. తెలుగుదేశం పార్టీ 40వ ఆవిర్భావ దినోత్సవ వేడుకను సోమవారం ఘనంగా నిర్వహిస్తున్నారు.
ఇందులో భాగంగానే.. రాజమండ్రిలో ఏర్పాటు చేసిన టీడీపీ ఆవిర్భావ సభలో బుచ్చయ్య మాట్లాడుతూ..రాబోయే రోజుల్లో టీడీపీలో అనూహ్యమైన సంస్థాగతమైన మార్పులు రాబోతున్నాయని.. ఈ సమయంలో జూనియర్ ఎన్టీఆర్ కూడా టీడీపీలోకి రావాలని, అందరం కలిసి పార్టీని బలోపేతం చేద్దామని పిలుపునిచ్చారు. ఇకపై పార్టీని అధికారంలోకి తేవడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని ఆయన పేర్కొన్నారు.