జ‌లీల్ ఖాన్ మ‌రోసారి అడ్డంగా బుక్క‌య్యాడుగా!

జ‌లీల్ ఖాన్‌. దాదాపు ఈ పేరు ఇటీవ‌ల కాలంలో పెద్దగా ప‌రిచ‌యం అక్క‌ర్లేకుండానే పోయింది. వైసీపీ త‌ర‌ఫున 2014లో విజ‌య‌వాడ ప‌శ్చిమం నుంచి గెలిచి.. ఆత‌ర్వాత బాబు మంత్రి ప‌ద‌వి హామీతో సైకిలెక్కిన జ‌లీల్‌.. అనూహ్యంగా ఓ టీవీ రిపోర్ట‌ర్‌కి ఇంట‌ర్వ్యూ ఇస్తూ.. ఏం చ‌దువుకున్నార‌న్న ప్ర‌శ్న‌కు బీకాం అని జ‌వాబిచ్చాడు. అంత‌టితో ఆగ‌కుండా బీకాంలో ఫిజిక్స్ అంటే త‌న‌కు బాగా ఇష్ట‌మ‌ని, అంద‌రూ త‌న‌నే మెచ్చుకునే వారి పెద్ద ఎత్తున ఊద‌ర గొట్టాడు. అదేంట్సార్ బీకాంలో ఫిజిక్సేంట‌ని అంటే.. స్టాటిస్టిక్స్ ఫిజిక్సే క‌దా అంటూ రెట్టించి మ‌రీ అంద‌రినీ క‌డుపుబ్బ‌న‌వ్వించాడు ఈ ఎమ్మెల్యే. దీంతో ప్ర‌పంచ‌లో బీకాంలో ఫిజిక్స్ చ‌దివిన ఏకైక నేత‌గా జ‌ల‌లీ అంద‌రికీ గుర్తిండిపోయాడు. 

తాజా ఆయ‌న మ‌రో కామెంట్ చేసి.. అడ్డంగా బుక్క‌యిపోయాడు. ప్ర‌స్తుతం నంద్యాల ఉప ఎన్నిక జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. దీనికి అధికార‌, విప‌క్షాలు పెద్ద ఎత్తున ప్ర‌చారం చేస్తున్నాయి. గెలుపును ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తున్న ఇరు ప‌క్షాలూ పెద్ద ఎత్తున త‌మ నేత‌ల‌ను అక్క‌డ మోహ‌రిస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే చంద్ర‌బాబు త‌న పార్టీ ప‌క్షాన జ‌లీల్‌ను నంద్యాల పంపారు. అక్కడ భారీ సంఖ్య‌లో ఉన్న ముస్లిం ఓట‌ర్ల‌ను ఆక‌ర్షించి.. వారి ఓట్లు టీడీపీకి ప‌డేలా చేయాల‌ని బాబు నిర్దేశించారు. ఇంకేముంది జ‌లీల్ ఉన్న‌ప‌ళాన నంద్యాల‌లో దిగేశాడు. 

ఇక‌, నంద్యాల‌లో ప్ర‌చారంలోకి దిగిన జ‌లీల్‌..  టీడీపీ అభ్యర్థి బ్రహ్మానంద రెడ్డి తరఫున భారీగా మాట్లాడుతున్నాడు. ముస్లింల‌ను ఉద్దేశించి మాట్లాడుతూ.. అభ్యర్థి పేరు కరెక్టుగానే చెప్పినా పార్టీ గుర్తు మాత్రం తప్పుగా చెప్పాడు. హస్తం గుర్తుకు ఓటేసి భూమా బ్రహ్మానంద రెడ్డిని భారీ మెజారీటీతో గెలిపించాలని ఆయన ముస్లింల‌ను కోరాడ‌ట‌. దీంతో ఒక్క‌సారిగా ఖంగుతిన్న నంద్యాల నేత‌లు జ‌లీల్‌కు ద‌ణ్నం పెట్టేశార‌ట‌. ఇక‌, స్థానికులు మాత్రం బీకాంలో ఫిజిక్స్ చ‌దివిన ఎమ్మెల్యేను చూసేందుకు భారీగా ఎగ‌బ‌డుతున్నార‌ట‌. మొత్తానికి నంద్యాలలో ఆయన ప్రచారం అత్యంత కామెడీగా ఉందని తెలుస్తోంది.