హంగులూ ఆర్భాటాలకు ఏపీ సీఎం చంద్రబాబు ఆమడ దూరంలో ఉంటారనే విషయం ఆయన మాటలు, దుస్తులను బట్టి తెలుస్తుంది. కానీ ఇప్పుడు ఆయన హైదరాబాద్‌లో కొత్తగా నిర్మించుకున్న ఇల్లు చూస్తే మాత్రం నోరెళ్ల బెట్టాల్సిందే. అత్యంత ఖరీదైన ఫర్నీచర్, అత్యాధునిక హంగులతో విశాలమైన ప్రాంగణంలో.. కట్టుకున్న ఈ అద్భుతమైన రాజ్‌మహల్ గురించి రోజుకో ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వస్తుంది. అదేంటంటే.. సినిమాల్లో చూసిన విధంగా.. కారుతో నేరుగా ఫస్ట్ ఫ్లోర్లోకే వెళ్లిపోవచ్చట.
`నా చేతికి వాచీ ఉండదు. నా జేబులో డబ్బులు ఉండవు` ఇవీ ఎక్కడకు వెళ్లినా గొప్ప విషయంలా చెప్పుకుని.. తనకు తాను పేదవాడిలా అభివర్ణించుకునే ప్రయత్న చేస్తుంటారు చంద్రబాబు!! ఆడంబరాలంటే తనకు అస్సలు పడదని నిత్యం వల్లెవేస్తుంటారు. కానీ మాటల్లోనే చంద్రబాబు పేద అని.. చేతల్లో రాజుకంటే గొప్పవాడని ఆయన నిర్మించుకున్న ఇంటిని చూస్తే అర్థమవుతుంది. చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఇంట్లోకి కారు వెళ్లేంత పేదవాడు మాత్రమే. హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో ఆయన కొత్తగా కట్టుకున్న ఇంటి ఫస్ట్ ప్లోర్ లోకి కారు కూడా వెళుతుంది.
జూబ్లిహిల్స్ లో నిర్మించిన కొత్త ఇంటి ఫస్ట్ ఫ్లోర్ లోకి కారు నేరుగా వెళ్లిపోతుందట. అటు చంద్రబాబు..ఆయన భార్య భువనేశ్వరికి చెందిన కార్లు ఫస్ట్ ఫ్లోర్ వరకూ వెళ్లేలా ఏర్పాట్లు చేసుకున్నారని చంద్రబాబు గృహ ప్రవేశంలో పాల్గొన్న వ్యక్తులు తెలిపిన సమాచారం. హైదరాబాద్ లో ఈ తరహా ఇళ్లు చాలా తక్కువనే చెప్పుకోవాలి. అంతేగాక జాతీయ నాయకులు..ఇతర పారిశ్రామికవేత్తలు వచ్చిన సమావేశాల కోసం ఓ విశాలమైన మందిరాన్ని కూడా నిర్మించుకున్నారు. అందులోనూ స్టార్ హోటల్ ను తలదన్నే సౌకర్యాలు కల్పించారట.
చంద్రబాబు ప్రస్తుతం విజయవాడలో ఉండేది కృష్ణా నది కరకట్ట ఒడ్డున విశాఖలమైన ఖరీదైన బంగ్లాలో. అప్పటికే రిచ్ గా ఉండే ఈ బంగ్లాను ప్రభుత్వ ఖర్చుతో మరింత సూపర్ రిచ్ గా చేయించారు. ఎక్కితే ప్రత్యేక ఫ్లైటు..దిగితే ప్రత్యేక ఫ్లైటు. లేదంటే హెలికాప్టర్. కానీ చంద్రబాబు మాత్రం పేదవాడే. సామాన్యుడే. పేదవాడైన చంద్రబాబే ఇంత రిచ్ గా ఉంటే.. ఇంకా రిచ్ గా ఉండే సంపన్నులు మరెంత విలాసవంతంగా ఉంటారో.