‘మెగా ఎక్స్‌ప్రెస్‌’ని నమ్మొచ్చా?

‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌’, ‘ఎక్స్‌ప్రెస్‌ రాజా’ సినిమాలతో విజయాలందుకున్న డైరెక్టర్‌ మేర్లపాక గాంధీ. శర్వానంద్‌ ‘ఎక్స్‌ప్రెస్‌ రాజా’తో బాగా పాపులర్‌ అయిపోయాడు ఈ సక్సెస్‌ రాజా మేర్లపాక గాంధీ. అందుకే మెగా పవర్‌ స్టార్‌ని డైరెక్ట్‌ చేసే మెగా ఛాన్స్‌ కూడా కొట్టేశాడు. మేర్లపాక గాంధీ డైరెక్షన్‌లో చరణ్‌ ఒక సినిమా చేయనున్నాడన్న సంగతి తెలిసిందే. అయితే ఇంకా ఈ ప్రాజెక్ట్‌ ఫైనల్‌ అయినట్లు చరణ్‌ నుండి అయితే క్లారిటీ రాలేదు కానీ, మేర్లపాక గాంధీ మాత్రం చరణ్‌ కోసం స్క్రిప్టు రెడీ చేసుకున్నాడు. ఆ స్క్రిప్టుకి ఏకంగా టైటిల్‌ కూడా పెట్టేసుకున్నాడని సమాచారం. ‘మెగా ఎక్స్‌ప్రెస్‌’ అనే పేరుని అనుకుంటున్నాడట చరణ్‌ సినిమాకి టైటిల్‌గా. అయితే చరణ్‌ ప్రస్తుతం చాలా బిజీగా ఉన్నాడు.

ఒక పక్క ‘ధృవ’ సినిమాలో హీరోగా చేస్తూ మరో పక్క మెగాస్టార్‌ సినిమాకి నిర్మాతగా పని చేస్తున్నాడు. అయినప్పటికీ ఇంకో పక్క కొత్త కథలు కూడా వింటూనే ఉన్నాడు. ‘ధృవ’ తర్వాత సుకుమార్‌తో ఒక లవ్‌ స్టోరీకి కమిట్‌ అయ్యాడు. ఆ తర్వాత కొరటాల శివతో యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ కూడా లైన్‌లో ఉంది. ఇవి కాక కృష్ణవంశీ, త్రివిక్రమ్‌ వంటి స్టార్‌ డైరెక్టర్లు కూడా చరణ్‌కి కథలు వినిపించారు. ఆ కథల పట్ల చరణ్‌ సుముఖంగానే ఉన్నాడు. మరి ఈ యంగ్‌ డైరెక్టర్‌కి మెగా ఛాన్స్‌ ఎప్పుడు దొరికేది. అయినప్పటికీ మేర్లపాక గాంధీ చరణ్‌ కోసం అదిరిపోయే స్టోరీని ప్రిపేర్‌ చేస్తున్నాడట. మళ్లీ ఎక్స్‌ప్రెస్‌నే నమ్ముకున్న ఈ ఎక్స్‌ప్రెస్‌ డైరెక్టర్‌కి మెగా ఎక్స్‌ప్రెస్‌ ఎక్కే ఛాన్స్‌ ఉందో లేదో చూడాలి.