చిరంజీవి ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి స్టార్ హీరోగా ఎదిగిన సంగతి తెలిసిందే. అయితే.. కెరీర్ ప్రారంభంలో విలన్ పాత్రలో నటించిన చిరు.. హీరోగా మారిన తర్వాత యాక్షన్, మాస్, క్లాస్, కామెడీ, డివోషనల్ అని తేడా లేకుండా దాదాపు అన్ని వేరియేషన్స్ లోనే తన సత్తా చాటుకున్నాడు, అయితే తన కెరీర్ ప్రారంభంలోనే స్టార్ కమెడియన్ అల్లు రామలింగయ్య కూతురు సురేఖను.. 1980 ఫిబ్రవరి 20న ఆయన వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లి టైంకి 5 సినిమాల్లో హీరోగా చేస్తున్న చిరు.. తన పెళ్లికి మాత్రం ఓ చిరిగిపోయిన చొక్క ధరించాల్సి వచ్చిందట. వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఇదే నిజం. ఇంతకీ చిరంజీవికి చిరిగిన చొక్కాతో వచ్చే కర్మేంటి.. అసలు ఎందుకలా చేయాల్సి వచ్చిందో.. ఓ సందర్భంగా స్వయంగా చిరంజీవి వివరించారు.
అసలు మేటర్ ఏంటంటే.. చిరు బాపు డైరెక్షన్‌లో మన ఊరి పాండవులు సినిమా చేస్తున్న టైంలో అదే సినిమాలో అల్లు రామలింగయ్య ఓ పాత్రలో నటించారు. ఈ షూటింగ్ టైంలో చిరంజీవి డెడికేషన్ చూసి ఆయన ఇంప్రెస్ అయిపోయాడట. ఎంతలా అంటే ఈ కుర్రాడికి.. నా కూతుర్ని ఇచ్చి చేసేయాలని ఫిక్స్ అయ్యేంతగా. విషయాన్ని ప్రొడ్యూసర్ జయకృష్ణతో వివరించాడట. సినిమాలో చిరు హీరో కాకపోయినా ఫ్యూచర్లో నటుడుగా ఇతనికి మంచి భవిష్యత్ ఉంటుందని అభిప్రాయపడ్డాడట రామలింగయ్య. విషయాన్ని ప్రొడ్యూసర్ తో చెప్పి.. అతని ద్వారా..చిరు నాన్న వెంకట్రావును కలిసి చిరంజీవి పెళ్లికి ఒప్పించేశారు. పెళ్లి చూపులకు సిద్ధం చేసేశారు. పెళ్లి చూపుల్లో సురేఖను చూసిన చిరంజీవి.. వెంటనే ఏం చెప్పకపోయినా.. కొన్నాళ్లకు ఓకే చెప్పడంతో.. పెళ్లికి ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి.
ఓకే అనుకున్న రెండు నెలల్లోనే.. పెళ్లి అయిపోవాలని అల్లు రామలింగయ్య పట్టు పట్టిన క్రమంలో.. ముహూర్తం వెంటనే పెట్టేసారు. ఓపక్క చిరు 5 సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్నారు. అందులో ఒకటి ఎమ్మెస్ రెడ్డి ప్రొడ్యూసర్ గా తాతయ్యకు ప్రేమలీలలు. ఈ సినిమాలో చిరంజీవి ఎలాగో ప్రొడ్యూసర్‌ను కన్విన్స్ చేసి మూడంటే మూడు రోజులు టైం చూసుకుని వివాహం చేసుకున్నారు. తీరా చూస్తే పెళ్లి రోజు కూడా షూటింగ్‌కు అటెండ్ అవ్వాలని.. ఎమ్మెస్ రెడ్డి చెప్పేసాడట. దీంతో ఒక సాంగ్ షూటింగ్కు అటెండ్ అయినా చిరు ఆ షూటింగ్లో షర్ట్ చిరిగిపోయినా.. అలాగే షూట్ నుంచి డైరెక్ట్ గా పెళ్లి మండపానికి వెళ్ళిపోయి వివాహం చేసుకున్నారు.
షర్ట్ మార్చుకోవడానికి కూడా టైం లేకపోవడంతో.. ముహూర్తం దగ్గర పడిపోవడంతో పెళ్లి పీటల మీద అదే చినిగిన షర్ట్‌తో కూర్చుని పోయాడట. అప్పటికే ఎవరో షర్టు చిరిగిపోయిందని చెప్పినా.. చిరాకుగా ఉన్న చిరు.. అయితే ఏంటి ఇప్పుడు షర్ట్ చిరిగిపోతే తాళికట్టనివ్వరా అంటూ మండిపడ్డాడట. ఇవన్నీ చిరంజీవి స్వయంగా వివరించాడు. ఇక అప్పట్లో బిజీ స్టార్ గా మెల్లమెల్లగా ఎదుగుతున్న చిరంజీవి.. పెళ్లి రోజులు కూడా లెక్కచేయకుండా షూటింగ్ తన పనిని పూర్తి చేశాడంటే.. నటనపై ఆయనకున్న అంకితభావం ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదంటూ ఫ్యాన్స్ ఈ మ్యాటర్‌ను తెగ వైరల్ చేసేస్తున్నారు.