ప్రస్తుతం ఇండస్ట్రీలో వందల కోట్ల బడ్జెట్ పెట్టి.. అంతకు మించిన ప్రమోషన్స్ చేస్తూ.. వేలకోట్ల కలెక్షన్లు వచ్చిన సినిమాలు చాలానే ఉన్నాయి. అయితే అది పెద్దగా సక్సెస్ సాధించినట్లు కాదని.. తక్కువ బడ్జెట్ తో ఎలాంటి ప్రమోషన్ లేకుండా సినిమా రిలీజ్ అయిన మొదటి షో తోనే కంటెంట్ నచ్చి.. ఆడియన్స్ థియేటర్లకు రావడం.. వందలకోట్ల కలెక్షన్లు రాబట్టడం.. అదే సరైన సక్సెస్ అంటూ ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇకపోతే.. ప్రపంచవ్యాప్తంగా ఇటీవల రిలీజ్ అయిన పుష్ప 2 ఎలాంటి రికార్డులను సృష్టించిందో చూస్తూనే ఉన్నాం. కానీ.. ట్రేడ్ పండితుల విశ్లేషణ ప్రకారం చూస్తే మాత్రం.. పుష్ప 2 ఇప్పుడు వెనుకబడినట్లు అనిపిస్తుంది.
యంగ్ హీరోతో చిన్న సినిమాగా పాన్ ఇండియన్ వైడ్‌గా రిలీజై.. ఊహించని కలెక్షన్లు సొంతం చేసుకున్న హనుమాన్.. బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సత్తా చాటుకుందో తెలిసిందే. ఈ సినిమా కథ, కంటెంట్, నటీనటుల పర్ఫామెన్స్ ప్రేక్షకులకు విపరీతంగా నచ్చేసింది. ఈ క్రమంలోనే ఆడియన్స్ సినిమాకు బ్రహ్మరథం పట్టారు. ముఖ్యంగా చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించిన హీరో తేజ సజ్జ.. హనుమాన్‌తో ఒక్కసారిగా స్టార్ హీరో ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం సినిమాతో ఢీ కొట్టి మరీ సక్సెస్ అందుకున్నాడు. దీన్నిబట్టి.. హనుమాన్ ఏ రేంజ్ లో ప్రేక్షకులకు కనెక్ట్ అయిందో అర్థమవుతుంది.
ఇకపోతే.. ఈ ఏడాది హైయెస్ట్ కలెక్షన్లు కొల్లగొట్టిన తెలుగు బాక్స్ ఆఫీస్ సినిమాలలో మొదట హనుమాన్ సినిమా రికార్డు క్రియేట్ చేసింది. కేవలం రూ.40 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా.. ప్రపంచ వ్యాప్తంగా రూ.294 కోట్లకు పైగా కలెక్షన్స్ సొంతం చేసుకుంది. అంటే 625% కంటే ఎక్కువ లాభాలను దక్కించుకుంది. అలా చూస్తే.. పుష్ప 2 కంటే హనుమాన్ మంచి సక్సెస్ అందుకుంది అంటూ ట్రేడ్ వర్గాలు ఉదాహరణ కూడా వెల్లడిస్తున్నాయి. పుష్ప 2 రూ.500 కోట్ల బడ్జెట్‌తో రూపొందితే.. 15 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ.1580 కోట్లు వచ్చాయి. అంటే.. ఇది 201.6% లాభాన్ని దక్కించుకుంది. దీన్ని ఉదాహరణగా తీసుకుంటే.. హనుమాన్ సినిమా ఏ రేంజ్ లో ఆడియన్స్ మెప్పించిందో తెలుస్తుందంటూ.. ఈ ఏడాది బాక్స్ ఆఫీస్ దగ్గర సంచలనం సృష్టించిన టాప్ తెలుగు సినిమా హనుమాన్ అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి.