టాలీవుడ్ దిగ్గజ నటుడు నందమూరి నట సార్వభౌమ తారకరామారావుకు తెలుగు ప్రేక్షకుల్లో ఎలాంటి ఇమేజ్ ఉందో చెప్పాల్సిన అవసరం లేదు. ఎంతో మంది హృదయాల్లో దైవంగా గూడు కట్టుకున్న ఎన్టీఆర్.. సినిమాలతోనే కాదు రాజకీయాలతోనూ తిరుగులేని ఖ్యాతిని సంపాదించుకున్నాడు. ఎన్టీఆర్ లక్షలాది మంది కుటుంబాలకు అండగా నిలిచాడు. ఇప్పటికీ లక్షలాదిమంది కుటుంబాలు ఆయన ప్రవేశపెట్టిన పథకాల ద్వారా లబ్ధిపొందుతున్నారంటే.. అప్పట్లో ఆయన ఎంత గొప్ప పాలన చేశారో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికీ ఆయన నటుడిగా చేసిన ఎన్నో పాత్రలు, చెప్పిన డైలాగులు ప్రజలు గుర్తు చేసుకుంటేనే అంటారు.
ఒక పాత్రలో ఆయన నటించాడు అంటే ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసి మరి ఆకట్టుకునే వాడు. పౌరాణిక పాత్రల్లో ఎన్టీఆర్ కెరాఫ్ అడ్రస్‌గా ఉండేవారు. ఇప్పటికే ప్రేక్షకుల హృదయాల్లో కృష్ణుడిగా, రాముడిగా, దుర్యోధనుడిగా, కర్ణుడిగా తిరుగులేని ముద్ర వేసుకున్న ఎన్టీఆర్.. రాముడు, కృష్ణుడు అనగానే కేవలం ఆయన మాత్రమే గుర్తుకు వచ్చే రేంజ్ కు ఎదిగాడు. అలా ఎన్టీఆర్ నటించిన ఎంతో గుర్తింపు తెచ్చుకున్న సినిమాల్లో దానవీరశూరకర్ణ ఒకటి. ఇందులో దుర్యోధన, కృష్ణ, కర్ణపాత్రలో నటించి మెప్పించాడు. త్రిపాత్ర అభినయం చేసిన ఈ సినిమా 1977 జనవరి 14న రిలీజై తిరుగులేని విజయాన్ని దక్కించుకుంది.
రామకృష్ణ సినీ వీడియోస్ పై స్వయంగా ఎన్టీఆర్ దర్శక, నిర్మాతగా వ్యవహరించాడు. ఇక కొడుకులు హరికృష్ణ, బాలకృష్ణ ఈ సినిమాలో భాగమయ్యారు. అప్పట్లో 20 లక్షలు బడ్జెట్ తో తీసిన ఈ సినిమా ఏకంగా మూడుసార్లు రిలీజై 15 రెట్లు ఎక్కువ లాభాలను దక్కించుకోవడం విశేషం. అప్పట్లోనే రూ.3 కోట్లకు పైగా నెట్ కలెక్షన్లు కొల్లగొట్టి రికార్డు క్రియేట్ చేసింది. అప్పట్లోనే సినిమాను నాలుగు గంటల నడివితో 25 రీల్స్‌తో తెరకెక్కించి చరిత్ర క్రియేట్ చేశారు. భారతదేశ సినీ చరిత్రలోనే అతిపెద్ద సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసిన దానవీరశూరకర్ణ ఏకంగా తొమ్మిది కేంద్రాల్లో వంద రోజులు ఆడి సంచలనం సృష్టించింది.