రామ్ చరణ్ కు డాక్టరేట్.. పుత్రోత్సాహంలో చిరంజీవి ఎమోషనల్ పోస్ట్ వైరల్..

చెన్నై వేల్స్ యూనివర్సిటీ ఇటీవల గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కు గౌరవ డాక్టరేట్ పురస్కారాన్ని అందించిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన వీడియో నెటింట‌ తెగ వైరల్ గా మారుతుంది. చెన్నైలోని వేల్స్ యూనివర్సిటీ స్నాతకోత్సవానికి ముఖ్యఅతిథిగా చరణ్‌ను ఆహ్వానించడమే కాకుండా ఇందులో ఆయనకు డాక్టరేట్ పురస్కారాన్ని అందించి సత్కరించారు. తెలుగు సినీ రంగానికి అందిస్తున్న సేవలకు గాను ఆయన ప్రతిభకు గాను ఈ డాక్టరేట్ ను పొందడం గమనార్హం. మెగాస్టార్ చిరంజీవి వారసుడుగా 2007లో ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన చరణ్ చిరుత సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయ్యాడు.

ఇప్పటికీ మొత్తం 14 సినిమాల్లో నటించిన రామ్ చరణ్, రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన ఆర్ఆర్ఆర్ తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. తండ్రికి తగ్గ తనయుడిగా భారీ పాపులారిటీతో పాన్ ఇండియా లెవెల్లో దూసుకుపోతున్నాడు. చరణ్ డాక్టరేట్ పొంద‌డంతో మెగాస్టార్ చిరంజీవి పుత్రోత్సాహంతో తన ఆనందాన్ని ఎమోషనల్ పోస్ట్ ద్వారా వ్యక్తపరిచాడు. ఒక తండ్రిగా నాకు చాలా గర్వంగా ఎమోషనల్‌గా ఉంది. ఇది ఒక అద్భుతమైన క్షణం అంటూ చిరంజీవి రాసుకొచ్చాడు.

బిడ్డలు గొప్ప విజయాన్ని సాధించినప్పుడు తల్లిదండ్రులకు వచ్చే ఆనందమే నిజమైన ఆనందం. రామ్ చరణ్ స్థిరంగా ముందుకు కొనసాగుతున్నాడు. లవ్ యు డియర్ డాక్టర్ రామ్ చరణ్ అంటూ సోషల్ మీడియా వేదికగా చరణ్ డాక్టరేట్ అందుకుంటున్న వీడియోను షేర్ చేసుకున్నారు చిరంజీవి. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ గేమ్‌చేంజర్‌ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తుది ద‌శ‌కు చేరడంతో ఎప్పుడెప్పుడు సినిమా ప్రేక్షకులు ముందుకు వస్తుందా.. అంటూ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా చరణ్ కు ఈ డాక్టరేట్ రావడంతో ఫ్యాన్స్ తమ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.