యూత్‌ను ఆలోచింప‌జేస్తోన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే ‘ కందాళ‌ ‘ విద్యా దాతృత్వం…!

విద్య నిగూఢ గుప్త‌మ‌గు విత్త‌ము- అన్న భ‌ర్తృహ‌రి సూక్తిని తూ.చ‌. త‌ప్ప‌క న‌మ్మే పాలేరు ఎమ్మెల్యే, బీఆర్ ఎస్ నాయ‌కుడు కందాళ ఉపేంద‌ర్‌రెడ్డి.. నియోజ‌క‌వ‌ర్గంలో అన్ని వ‌ర్గాల విద్యార్థుల‌కు విద్య‌ను చేరువ చేసేందుకు నిరంత‌రం కృషి చేస్తున్నారు. ఒక‌వైపు ప్ర‌భుత్వ ప‌రంగా పాఠ‌శాల‌లు, క‌ళాశాల‌ల నిర్మాణంపై దృష్టి పెడుతూనే.. మ‌రోవైపు విద్యార్థుల‌ను మ‌రింతగా ప్రోత్స‌హిస్తున్నారు. దీనిలో భాగంగా ఆయ‌న ఏకంగా కేవలం విద్య‌పైనే 41 కోట్ల రూపాయ‌ల పైచిలుకు ఖ‌ర్చు చేయ‌డం విశేషం. చ‌దువుతోనే విద్యార్థులు త‌మ జీవితాల‌ను సుఖ‌మ‌యం చేసుకుంటార‌ని విశ్వ‌సించే ఎమ్మెల్యే కందాళ‌.. పాలేరు నియోజ‌క‌వ‌ర్గంలో అధునాత న వ‌స‌తుల‌తో పాఠ‌శాల‌లు, క‌ళాశాల‌ల నిర్మాణానికి న‌డుం బిగించారు. ఉన్న‌వాటిని ఆధునీక‌రించారు.

 

ముఖ్యంగా మారుతున్న కాలానికి అనుగుణంగా.. అధునాత‌న సౌక‌ర్యాలు ఏర్పాటు చేశారు. డిజిట‌ల్ బోర్డులు, లైబ్ర‌రీలు, స్వ‌చ్ఛ‌మైన‌ తాగునీరు, మూత్ర‌శాల‌లు, మ‌రుగుదొడ్ల‌ను ఏర్పాటు చేసి.. విద్యార్థుల‌కు ఏ స‌మ‌స్య వ‌చ్చినా నేనున్నానంటూ.. వారికి పెద్ద‌దిక్కుగా మారి చ‌దివిస్తున్నారు. త‌న నియోజ‌క‌వ‌ర్గంలో పాఠ‌శాల‌ల్లో చ‌దివే విద్యార్థుల‌కు అల్పాహారం అందించేందుకే ఆయ‌న రు. 20 ల‌క్ష‌లు ఖ‌ర్చు పెట్టారు. అలాగే నియోజ‌క‌వ‌ర్గంలోని అన్ని ప్ర‌భుత్వ స్కూళ్ల‌లో చ‌దివే ప్ర‌తి విద్యార్థికి స్టీల్ ప్లేటుతో పాటు గ్లాసు అందించారు. నిజం చెప్పాలంటే తాము సొంతంగా కొనుక్కున్నా అంత క్వాలిటీ ప్లేటు, గ్లాసు కొన‌మ‌ని విద్యార్థులు త‌ల్లిదండ్రులే కందాళ‌ను మెచ్చుకున్నారు.

జేఎన్‌టీయూ, న‌ర్సింగ్ కాలేజ్‌లు జిల్లాకే హైలెట్ :
ఇక నియోజ‌క‌వ‌ర్గంలోని ఖ‌మ్మం రూర‌ల్ మండ‌లంలోని మ‌ద్దుల‌ప‌ల్లిలో ప్ర‌తిష్టాత్మ‌కంగా జేఎన్‌టీయూ ఇంజ‌నీరింగ్ కాలేజ్ ఏర్పాటు చేయించ‌డంలో కందాళ ఎంతో క‌ష్ట‌ప‌డ్డారు. ఈ కాలేజ్ కోసం జిల్లాలో మిగిలిన ఎమ్మెల్యేలు పోటీప‌డినా కందాళ త‌న నియోజ‌క‌వ‌ర్గంలోనే ఈ కాలేజ్ ఏర్పాట‌య్యేలా పోరాటం చేసి స‌క్సెస్ అయ్యారు. ఈ కాలేజ్‌లో ఈ యేడాది నుంచే ఐదు బ్రాంచ్‌ల‌తో క్లాసులు స్టార్ట్ అయ్యాయి. ఇక ఇదే గ్రామంలో న‌ర్సింగ్ కాలేజ్ ఏర్పాటయ్యేలా చేయ‌డంలోనూ కందాళ స‌క్సెస్ అయ్యారు. ఇక పిష‌రీస్ డిగ్రీ కాలేజ్ కూడా ఈ నియోజ‌క‌వ‌ర్గానికే మంజూరైంది.

నిజానికి గ‌త ఎమ్మెల్యేల హ‌యాంలో పాలేరు నియోజ‌క‌వ‌ర్గంలో పాఠ‌శాల‌ల‌ను, విద్యావ్యాప్తిని ఏ ఒక్క‌రూ పట్టించుకోలేదు. కానీ, కందాళ ఎమ్మెల్యే అయ్యాక‌.. విద్య‌ను బాగా ప్రోత్స‌హించారు. ఒక‌వైపు స‌ర్కారు త‌ర‌ఫున ప‌నులు చేయిస్తూనే మ‌రోవైపు.. `కందాళ ఫౌండేష‌న్‌` ద్వారా కూడా విద్య‌ను ప్రోత్స‌హిస్తున్నారు. ఎక్క‌డా డ్రాపౌట్లు లేకుండా.. విద్యార్థుల‌కు స‌మ‌స్తం తానే అయి వారికి పోష‌ణ కూడా బాధ్య‌త తీసుకున్నారు. ముఖ్యంగా కాంపిటీష‌న్ ప‌రీక్ష‌లు రాసే విద్యార్థుల‌కు హైద‌రాబాద్ నుంచి ఫ్యాక‌ల్టీల‌ను తీసుకువ‌చ్చి మ‌రీ వారికి శిక్ష‌ణ అందిస్తున్నారు. దీనిలో భాగంగా ఉద‌యం అల్పాహారం నుంచి మ‌ధ్యాహ్నం భోజ‌నం, సాయంత్రం స్నాక్స్ వ‌ర‌కు సొంత నిధుల ఖ‌ర్చుతో విద్యార్థుల‌కు ఎలాంటి ఇబ్బందీ రాకుండా చూసుకుంటున్నారు.

వారికి కావాల్సిన స్ట‌డీ మెటీరియ‌ల్ కూడా ఉచితంగా అందించారు. ఇలా.. కందాళ ఫౌండేష‌న్ ద్వారా చ‌దువుకున్న విద్యార్థులు అనేక ఉద్యోగాలు పొంది.. జీవితంలో స్థిర‌ప‌డ్డారంటే.. అదంతా ఎమ్మెల్యే ఉపేంద‌ర్‌రెడ్డి ముందు చూపే అన‌డంలో సందేహంలేద‌ని స్థానికులు చెబుతున్నారు. నిజంగా ఇదో గొప్ప ప్ర‌య‌త్నంగానే పార్టీల‌కు అతీతంగా ప్ర‌శంసిస్తున్నారు. ముఖ్యంగా యువ‌త అయితే ఈ త‌ర‌హా నాయ‌కత్వాన్ని తాము ఎంక‌రేజ్ చేయాల‌ని కూడా చ‌ర్చించుకుంటున్నారు.