పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేతిలో ఉన్న భారీ ప్రాజెక్ట్స్ లో `సలార్` ఒకటి. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మలయాళ అగ్ర హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్‌గా నటిస్తున్నాడు. శృతి హాసన్ హీరోయిన్ గా చేస్తోంది. రెండు భాగాలుగా ఈ సినిమా రాబోతోందని ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. అన్నీ అనుకున్నట్లు జరిగుంటే సలార్ పార్ట్ 1 నిన్న థియేటర్స్ లో అట్టహాసంగా విడుదల అయ్యుండేది.
వీఎఫ్‌ఎక్స్ డిలే కారణంగా వాయిదా పడింది. తాజాగా మేకర్స్ కొత్త రిలీజ్ డేట్‌ని ప్రకటించారు. క్రిస్మస్ పండుగా కానుకగా డిసెంబర్ 22న సలార్ ఫస్ట్ ఫార్ట్ ను విడుదల చేయనున్నట్టు అనౌన్స్ చేశారు. దీంతో డార్లింగ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయిపోతున్నారు. అయితే మరోవైపు సలార్ రిలీజ్ డేట్ అప్డేట్ తో టాలీవుడ్ కు చెందిన విక్టరీ వెంకటేష్, న్యాచురల్ నాని మరియు నితిన్ లకు పెద్ద తలనొప్పి మొదలైంది.
ఎందుకంటే నాని, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ `హాయ్ నాన్న`ను డిసెంబర్ 21న రిలీజ్ చేస్తామని ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. అలాగే వెంకటేష్ యాక్షన్ థ్రిల్లర్ ‘సైంధవ్’ డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతోంది. మరోవైపు నితిన్, శ్రీలీల కలిసి నటిస్తున్న ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ డిసెంబర్ 23న రావాల్సి ఉంది. కానీ, ఇప్పుడు సలార్ ఆగమనంతో ఈ మూడు సినిమా రిలీజ్ డేట్స్ ను మార్చాల్సి ఉంటుంది. లేదంటే ప్రభాస్ మ్యానియాకు దారుణంగా కొట్టుకుపోతాయి. ఈ నేపథ్యంలోనే నాని `హాయ్ నాన్న` రిలీజ్ డిసెంబర్ 7కు ప్రీ పోన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక సైంధవ్ ను జనవరి 13వ తేదీకి పోస్ట్ పోన్ అవ్వనుందని అంటున్నారు. మరి నితిన్ సినిమా పరిస్థితి ఏంటో చూడాలి.