అమ్మకు అగ్నిపరీక్ష.. ఏం చేస్తారో చూడాలి మరి….!

ఏపీ కాంగ్రెస్‌ పార్టీకి వైఎస్‌ షర్మిళ కొత్త అధ్యక్షురాలుగా రాబోతున్నారా..? పత్రికలో వచ్చిన కథనం మేరకు ఇదే జరగబోతోంది. అయితే ఇది జరిగే పనేనా..? అనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఒకప్పుడు పాలు-నీళ్లలా ఉన్న జగన్‌-షర్మిళలు ఇప్పుడు ఉప్పు నిప్పులా మారిన మాట వాస్తవమే. కానీ ఆమె నేరుగా తన అన్నతో ఢీకొనడానికి ఇష్టం లేకే.. తెలంగాణలో పార్టీ పెట్టారు. కానీ ఇప్పుడు కొన్ని పరిణామాలు జరిగాయి… పరిస్థితులు మారాయని అంటున్నారు. కాంగ్రెస్‌ పార్టీలో తాను స్థాపించిన పార్టీని విలీనం చేసేసి.. ఏపీలో తన అన్నను గట్టిగా ఢీ కొనాలనే ధృఢ సంకల్పంతో ఉన్నారనేది పత్రికల కథనం. ఇదే నిజమైతే ఏపీలో చాలా రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటాయనే చెప్పాలి. ఓట్ షేర్‌.. ఓటు బ్యాంక్‌.. కాంగ్రెస్‌ పార్టీలో పరిణామాలు.. ఇలా చాలా తెరపైకి వస్తాయి.

ఇదే సందర్భంలో మరో ఆసక్తికర చర్చా జరుగుతోంది. అన్న వదిలిన బాణం షర్మిళ తిరిగి అన్న మీదకే రావడానికి అంగీకరించినా.. ఆమె తల్లి విజయమ్మ దీనికి అంగీకరిస్తారా..? అనేది మిలియన్‌ డాలర్ల క్వశ్చన్‌గా ఉంది. ఏపీలో తన కుమారుడికి వ్యతిరేకంగా రాజకీయం చేయడానికి తన కుమార్తెను విజయమ్మ అనుమతిస్తారా..? ఇప్పటి వరకు చూస్తుంటే విజయమ్మ కూతురు వైపే మొగ్గు చూపారు. కూతురుకు అండగా నిలవడమే ప్రాధాన్యతాంశంగా తీసుకున్నారు. అయితే షర్మిళ తెలంగాణకు వెళ్లారు కాబట్టి.. అక్కడి రాజకీయాల్లోనే ఉంటారు కదా..? పుత్ర రత్నానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు కదా..? అని భావించి విజయమ్మ వెళ్లి ఉండొచ్చు. కానీ ఇప్పుడు నేరుగా జగన్ను ఢీకొనడానికి షర్మిళ సిద్దపడినా.. విజయమ్మ గతంలో మాదిరిగానే షర్మిళకు సహకరిస్తారా..? అనేది ఆసక్తికరంగానే మారింది.

ఈ సందర్భంలోనే విజయమ్మపై కుటుంబ పరంగా ఒత్తిడి పెరిగే అవకాశాలు దండిగా కన్పిస్తున్నాయి. ఒకవేళ షర్మిళ ఏపీకి వచ్చేయాలనే నిర్ణయమే తీసుకుంటే.. షర్మిళను కట్టడి చేయాలని విజయమ్మపై జగన్‌ ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడు ఆమె రెండు కళ్లల్లో ఏదోక కంటికే ప్రాధాన్యం ఇవ్వక తప్పదేమో..? షర్మిళ వైపే విజయమ్మ నిలబడితే జగనుకు నైతికంగా భారీ దెబ్బ తగిలినట్టే భావించాలి. ఇప్పటికే తల్లి.. చెల్లెలను పట్టించుకోవడం లేదనే విమర్శలను జగన్‌ ఎదుర్కొంటున్నారు. ఇక షర్మిళ నేరుగా ఏపీ రాజకీయ రంగంలోకి దూకితే.. ఆమె నేరుగా జగన్ను విమర్శించే పరిస్థితి వస్తుంది. అంతే కాకుండా.. వైఎస్‌ వివేకా కుమార్తె సునీతమ్మ కూడా కాంగ్రెస్‌ పార్టీలో చేరి.. షర్మిళకు దన్నుగా నిలిచినా ఆశ్చర్యం పోనక్కర్లేదు. ఏది ఏమైనా.. ఈ ఎపిసోడ్‌ విజయమ్మకు అగ్ని పరీక్షే.