`డెవిల్` టీజర్ వ‌చ్చేసింది.. క‌ళ్యాణ్ రామ్ కుమ్మేశాడు భ‌య్యో!!

`బింబిసార` మూవీతో గ‌త ఏడాది బిగ్గెస్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ను ఖాతాలో వేసుకుని మ‌ళ్లీ ఫామ్ లోకి వ‌చ్చిన నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్‌.. ఆ త‌ర్వాత `అమిగోస్‌` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించాడు. అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజ‌యం సాధించ‌లేదు. ప్ర‌స్తుతం `డెవిల్‌` మూవీతో క‌ళ్యాణ్ రామ్ బిజీగా ఉన్నాడు. `ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్` అనేది ట్యాగ్ లైన్. ఇందులో సంయుక్త మీన‌న్ హీరోయిన్ గా న‌టిస్తోంది.

నవీన్ మేడారం డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అభిషేర్ నామా నిర్మిస్తున్నారు. ఇండియాకు స్వాతంత్య్రం రావడానికి ముందు జరిగిన కథతో ఈ మూవీని తెర‌కెక్కిస్తున్నారు. ఇందులో బ్రిటిష్ ప్రభుత్వం తరఫున పనిచేసే సీక్రెట్ ఏజెంట్‌గా కళ్యాణ్ రామ్ క‌నిపిస్తాడు. అయితే నేడు క‌ళ్యాణ్ రామ్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా.. డెవిల్ టీజ‌ర్ ను బ‌య‌ట‌కు వ‌దిలారు. ఈ టీజ‌ర్ అదిరిపోయింద‌నే చెప్పాలి. హై టెక్నికల్ వాల్యూస్ తో బ‌య‌ట‌కు వ‌చ్చిన ఈ టీజ‌ర్ అంద‌రినీ విశేషంగా ఆక‌ట్టుకుంటోంది.

 

`మనసులో ఉన్న భావన ముఖంలో తెలియకూడదు. మెదడులో ఉన్న ఆలోచన మాటల్లో బయటపడకూడదు. గూఢచారికి ఉండవలసిన ముఖ్యమైన లక్షణం అదే` అంటూ కళ్యాణ్ రామ్ చెప్పే డైలాగ్ టీజర్‌లో హైలైట్‌గా నిలుస్తుంది. అలాగే విజువ‌ల్స్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌, కల్యాణ్ రామ్ చేసిన స్టంట్స్, ఆయ‌న లుక్స్‌ అద్భుతంగా ఉన్నాయి. ఒక్క ముక్క‌లో చెప్పాలంటే క‌ళ్యాణ్ రామ్ కుమ్మేశాడు. మ‌రి బ్రిటిష్ నేపథ్యంలో పీరియడ్ స్పై డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం క‌ళ్యాణ్ రామ్ కు ఎలాంటి ఫ‌లితాన్ని అందిస్తుందో చూడాలి.