ఇన్‌స్టాగ్రామ్‌లో విజయ్ సేతుపతి ఫాలో అయ్యేది వీరినే

తమిళ ప్రజలు మక్కల్ సెల్వన్ అని ముద్దుగా పిలుచుకునే విజయ్ సేతుపతి ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఆయన నటనకు సినీ నటులు సైతం ముచ్చట పడుతుంటారు. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి సైతం విజయ్ సేతుపతిని ప్రత్యేకంగా ప్రశంసించారు. ఇలా సినిమాల్లో తన అద్భుతమైన నటనతో పెద్ద ఎత్తున అభిమానులను సంపాదించుకున్నాడు. గతంలో చాలా లావుగా, బబ్లీగా ఉండే విజయ్ సేతుపతి ఇటీవల చాలా మారిపోయాడు. చాలా స్లిమ్ లుక్‌లో దర్శనమిచ్చాడు. ఆ ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ఇది చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోయారు. విజయ్ చాలా బరువు తగ్గాడని, ఇప్పుడు తెరపై కొత్త అవతారంలో కనిపించబోతున్నాడని అంటున్నారు. ప్రస్తుతం విజయ్ సేతుపతి జవాన్ సినిమాలో నటిస్తున్నాడు. ఇందులో హీరో షారుఖ్ ఖాన్. ఈ ప్రతిష్టాత్మక సినిమాలో విలన్‌గా విజయ్ సేతుపతి నటిస్తున్నాడు. పాన్ ఇండియా సినిమాలో తొలిసారి నటిస్తున్న విజయ్ సేతుపతికి ఖచ్చితంగా హిట్ ఖాయమనే అభిప్రాయం వినిపిస్తోంది.

విజయ్ సేతుపతికి ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఉంది. అయితే ఆయన సోషల్ మీడియాలో అంత యాక్టివ్ గా ఉండరు. ముఖ్యంగా తన పర్సనల్ విషయాలను ఇతరులతో పంచుకోరు. ఆయనకు ఇన్‌స్టాగ్రామ్‌లో 7.3 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు. అయితే విజయ్ సేతుపతి మాత్రం కేవలం ఏడుగురిని మాత్రమే ఫాలో అవుతున్నారు. ఆ ఏడుగురిలో ప్రముఖ దర్శకుడు, నయనతార భర్త విఘ్నేష్ శివన్, మరో ఇద్దరు డైరెక్టర్లు మిస్కిన్, రంజిత్ జయకోడి ఉన్నారు. వీరే కాకుండా హీరోయిన్ అంజలి, నటుడు రమేష్ తిలక్, పాటల రచయిత కార్తీక్ నేత ఈ జాబితాలో ఉన్నారు. ఇక తన సొంత నిర్మాణ సంస్థ విజయ్ సేతుపతి ప్రొడక్షన్స్ ఖాతాను కూడా ఆయన ఫాలో అవుతున్నారు. విజయ్ కీలక పాత్రలో నటించిన ‘విక్రమ్’ సినిమా గతేడాది భారీ విజయాన్ని అందుకుంది.

తమిళం, తెలుగు, హిందీ భాషల్లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో విజయ్ భయంకరమైన విలన్‌గా నటించాడు. ఇదే కాకుండా ఫర్జీ పేరుతో వచ్చిన అమెజాన్ వెబ్ సిరీస్‌లో ఆయన పోలీస్ పాత్రను పోషించాడు. ప్రస్తుతం జవాన్‌తో పాటు పలు సినిమాలలో కీలక పాత్రలను ఆయన పోషిస్తున్నారు.