షూటింగ్‌లో తీవ్రంగా గాయపడ్డ సింగర్ మంగ్లీ..

ప్రముఖ ఫోక్ సింగర్ మంగ్లీ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. మొదట యాంకర్ గా తన కెరీర్ ని మొదలు పెట్టిన మంగ్లీ ప్రైవేట్ సాంగ్స్ తో మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఇక ఆ తర్వాత సినిమాల్లో అవకాశం దక్కించుకొని మంచి పాటలు పాడి స్టార్ సింగర్స్ లిస్టులోకి చేరిపోయింది. తక్కువ సమయంలోనే దాదాపు 100కు పైగా పాటలు పాడి ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. సింగర్ గానే కాకుండా నటిగా కూడా కొన్ని సినిమాల్లో నటించింది.

మంగ్లీ ప్రతి పండక్కి ఒక ప్రైవేట్ సాంగ్ పాడి ఆ వీడియోను తన యూట్యూబ్ ఛానల్ లో అప్లోడ్ చేసి ఫ్యాన్స్ ని అలరిస్తూ ఉంటుంది. అయితే ప్రస్తుతం తెలంగాణలో ఆషాఢ బోనాల జాతర మొదలైంది. అక్కడ ఒక ప్రైవేట్ సాంగ్ షూట్ చేయడానికి వెళ్ళిన మంగ్లీ జారి కింద పడిపోయింది. దాంతో ఆమె కాలుకి గాయం అయినట్లు తెలుస్తుంది. వెంటనే అక్కడ ఉన్న యూనిట్ మంగ్లీని ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించగా వైద్యులు ఆమెకి ట్రీట్మెంట్ చేసి డిస్చార్జ్ చేసినట్లు సమాచారం.

డిశ్చార్జ్ అయిన తర్వాత కొద్ది రోజులు ఆమె బెడ్ పై నుంచి కదలకుండా పూర్తిగా రెస్ట్ తీసుకోవాలని చెప్పారట వైద్యులు. ఒకవేళ ఆమె రెస్ట్ తీసుకోకపోతే కాలు నొప్పి మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని వైద్యులు చెప్పారట. మంగ్లీ అలా జారి పడి, గాయాల పాలవడంతో ఆమె అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అభిమానులతో పాటు సెలబ్రిటీలు కూడా మంగ్లీ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.