తన ఫేవరెట్ కమెడియన్ ఎవరో చెప్పేసిన ప్రముఖ హాస్యనటుడు సుధాకర్..

టాలీవుడ్ ఇండస్ట్రీలో హిలేరియస్ కామెడీ పండిస్తూ తెలుగు వారికి ఎంతో వినోదాన్ని పంచిన హాస్యనటులలో సుధాకర్ ముందు వరుసలో ఉంటాడు. సినిమాల్లో నటించినంత కాలం సుధాకర్ తనదైన కామెడీ మార్కు చూపిస్తూ అలరించాడు. కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్న సమయంలోనే అతడిని అనారోగ్య సమస్యలను వెంటాడాయి. దాంతో ఈ టాలెంటెడ్ కమెడియన్ అందరికంటే ముందే సినిమా ఇండస్ట్రీకి దూరం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం సుధాకర్ వయసు 64 ఏళ్లు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతూ చాలా క్షీణించారు. ఇప్పుడు వృద్ధాప్య సమస్యలు కూడా అతడిని చుట్టుముట్టాయి.

దాంతో మళ్లీ సినిమాల్లో కనిపించే సామర్థ్యం అతనికి లేకుండా పోయింది. అయినా ఓపిక చేసుకొని ఈమధ్య ఒక ప్రముఖ టీవీ షోకి వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూ ఫాదర్స్ డే సందర్భంగా ఆదివారం రోజు ప్రసారం చేశారు. ఈ ఇంటర్వ్యూలో సుధాకర్ గుర్తుపట్టని స్థాయిలో కనిపించి అభిమానులకు షాక్ ఇచ్చారు. ఆ స్థితిలో ఉన్నా సరే అభిమానుల కోసం తన కెరీర్ లైఫ్ నుంచి ఎన్నో విషయాల గురించి మాట్లాడాడు. ఇటీవల కాలంలో తాను చనిపోయినట్లు వార్తలు వస్తున్నాయని, అవి వింటుంటే ఎంతో బాధగా ఉందని కూడా అతను తెలిపాడు. బతికున్నవారిని చనిపోయినట్లు ఫేక్ న్యూస్ క్రియేట్ చేయకండని కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశాడు.

ఇక కెరీర్ గురించి మాట్లాడుతూ ఎన్నో మంచి పాత్రలలో తాను పోషించానని, అవి గుర్తు చేసుకుంటుంటే చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నాడు. ఇండస్ట్రీలో ఎంతోమంది కమెడియన్స్ తో కలిసి తాను కలిసి పని చేశానని, అయితే వారందరిలో ఎమ్మెస్ నారాయణ అంటే తనకు ఎంతో ఇష్టమని తెలిపాడు. ఇక ఎమ్మెస్ నారాయణ కూడా మంచి హాస్యనటుడు, రచయిత. ఆయన కూడా తెలుగు ఇండస్ట్రీకి ఎన్నో సేవలను అందించాడు. తెలుగువారిని కడుపుబ్బా నవ్వించాడు.