ఆగస్టులో పెద్ద హీరోల సినిమాలు.. బాక్సాఫీసు వద్ద బిగ్ ఫైట్

సమ్మర్ సీజన్‌ను లైట్ తీసుకున్న స్టార్లంతా ఇండిపెండెన్స్ డే నాటికి బిగ్ ఫైట్‌కి సిద్ధం అవుతున్నారు. సౌత్, నార్త్ ఇండస్ట్రీల నుంచి స్టార్ హీరోలను బరిలోకి దిగుతుండడంతో వారి సినిమాల మధ్య పోటీ ప్రేక్షకులకు ఇంట్రెస్టింగ్‌గా మారింది. అంతేకాదు ఈ సీజన్‌ రిలీజ్‌కి సిద్ధం అవుతున్న సినిమాలన్నీ పాన్ ఇండియా సినిమాలు కావడంతో హీట్ మరింత పెరిగి పోతోంది. ఇక టాలీవుడ్ విషయానికొస్తే మెగాస్టార్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా భోళాశంకర్. మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఆగస్టు 11న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాలో చిరంజీవి చెల్లెలి పాత్రలో ప్రముఖ హీరోయిన్ కీర్తి సురేష్ నటించింది. చిరంజీవి సరసన హీరోయిన్ గా తమన్నా భాటియా నటించింది. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి.

ఈ తరుణంలో చిరు కంటే ఒక్క రోజు ముందుగానే తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా థియేటర్లల విడుదల కానుంది. ఇప్పటికే ఆయన జైలర్ సినిమా షూటింగ్ కంప్లీట్ అయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమాను ఆగస్టు 10న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్లాన్‌లో ఉంది చిత్రబృందం. బాలీవుడ్‌లో అయితే పోటీ మరింత టఫ్‌గా కనిపిస్తోంది. సందీప్ రెడ్డి దర్శకత్వంలో రణబీర్ కపూర్ హీరోగా తెరకెక్కిన యానిమల్ సినిమాను ఆగస్టు 11న రిలీజ్ చేస్తామని చిత్రబృందం ఎప్పుడో ప్రకటించింది.

అదే టార్గెట్‌తో సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేస్తున్నారు. తాజాగా గదర్ 2 కూడా ఆగస్టు బరిలో నిలిచినట్లు తెలుస్తోంది. గదర్ సినిమాకు మంచి రెస్పాన్స్ రావడంతో సీక్వెల్‌పై చిత్ర బృందం మరింత ఫోకస్ చేసింది. అందుకే పోటీని పట్టించుకోకుండా ఆగస్టు 11న రిలీజ్ చేయాలని చిత్ర బృందం పట్టుదలతో ఉంది. ఈ సీజన్‌లోకి సడన్ ఎంట్రీ ఇచ్చిన సినిమా ఓ మై గాడ్ 2. ఈ సినిమా అప్ డేట్ ఇప్పటి వరకు ఒక్కటి కూడా ఇవ్వకుండా అకస్మాత్తుగా సినిమా రిలీజ్‌ను చిత్ర బృందం అనౌన్స్ చేశారు. ఓ మై గాడ్ హిట్ కావడంతో సీక్వెల్ పై మంచి అంచనాలు ఉన్నాయి. ఒకేసారి స్టార్ హీరోల సినిమాలన్నీ రిలీజ్ అవుతుండడంతో బాక్సాఫీసు వద్ద సందడి నెలకొంది. ఏ సినిమా విజయవంతం అవుతుందో, ఏది రికార్డులు క్రియేట్ చేస్తుందోననే అంచనాలు ప్రస్తుతం భారీగా ఉన్నాయి.