బిటౌన్లో రకుల్‌ ని పట్టించుకొనే నాధుడే కరువయ్యాడు, పాపం!

ఈ రంగురంగుల సినీ జీవితంలో ఎవరి జీవితం ఎప్పుడు ఎలా మారుతుందో చెప్పడం కష్టం. ఎవరో అన్నట్టు ‘దూరపు కొండలు నునుపు’ అనే నానుడి సినిమా పరిశ్రమకు చక్కగా సరిపోతుంది. ఇక్కడ రాత్రికి రాత్రే సెలిబ్రిటీలు అయినవారు వున్నారు. అదేవిధంగా ఓవర్ నైట్ కింద పడిపోయేవారు కూడా వున్నారు. ఇక్కడ జయాపజయాలు అనేవి నల్లేరు మీద నడకలాగా సాగుతూ ఉంటాయి. ఇపుడు ఇదే విషయాలు నిన్న మొన్నటివరకు టాలీవుడ్ ని ఏలిన హీరోయిన్ రకుల్ విషయంలో ప్రస్ఫుటమౌతున్నాయి.

ఒకప్పుడు టాలీవుడ్ అందగాడు, సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలో నటించేందుకు డేట్లు లేవు అంటూ నో చెప్పిన రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు అత్యంత గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటుందని చెప్పుకోక తప్పదు. తెలుగులో ఏడాదికి దాదాపు ఐదారు సినిమాల్లో ఏకధాటిగా నటించిన రకుల్ ప్రీత్ సింగ్ ఈ మధ్య కాలంలో అవకాశాలు లేక చాలా ఇబ్బందులు పడుతోంది. ఒకానొక సమయంలో బాలీవుడ్ కి పూర్తిగా సర్దుకొని వెళ్ళిపోయింది. అయితే అక్కడ అనూహ్యంగా వరుస ఆఫర్లు చేజిక్కించుకుంది. ఈ రెండేళ్ల కాలంలో ఏకంగా 10 సినిమాల్లో నటించింది అక్కడ. అయినా విజయం దక్కకపోవడంతో రకుల్ ప్రీత్ డిఫెన్స్ లో పడిపోయింది.

సినిమాల సక్సెస్ మాట అటుంచితే కనీసం తన పాత్రతో హిందీ ప్రేక్షకుల్లో నోటెడ్ అవ్వలేక పోయింది రకుల్. ఇంకేముంది కట్ చేస్తే రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్లో కూడా కనుమరుగయ్యే పరిస్థితి వచ్చింది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో హాట్ ఫోటో షూట్స్ ని షేర్ చేయడం ద్వారా ఇండస్ట్రీ వర్గాల వారిని కూడా ఆకర్షించి సినిమాల్లో అవకాశాలను దక్కించుకోవాలని రకుల్ ప్రీత్ సింగ్ యత్నిస్తోంది. ఏదిఏమైనా బిటౌన్లో రకుల్‌ ని పట్టించుకొనే నాధుడే కరువయ్యాడు అనడంలో అతిశయోక్తి లేదు. ముందు ముందు అయినా సౌత్ లేదా నార్త్ లో రకుల్ ప్రీత్ సింగ్ మళ్లీ బిజీ అవుతుందేమో చూడాలి మరి.