మళ్లీ టాలీవుడ్ నెంబర్.1 హీరోగా మహేష్ బాబు.. మిగతా 9 స్థానాల్లో ఎవరో తెలుసా?

టాలీవుడ్ లో ప్రస్తుతం హీరోలంతా మంచి జోష్ లో ఉన్నారు. వరుస సినిమాలతో సక్సెస్ ఫుల్ గా కెరీర్ కొనసాగిస్తున్నారు. అయితే టాలీవుడ్ నెంబర్ వన్ హీరో ఎవరు అనే విషయంపై తాజాగా మరోసారి సర్వే ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ నెంబర్ గేమ్ మీద ఆర్మాక్స్ సంస్థ ప్రతి నెల సర్వే చేస్తుంది. తాజాగా 2021 సంవత్సరం ముగియడంతో ఓవరాల్ గా నెంబర్ వన్ గా నిలిచిన హీరోతో పాటు మొత్తం పది స్థానాల్లో నిలిచిన హీరోల వివరాలను ఈ సంస్థ వెల్లడించింది.

మరోసారి సూపర్ స్టార్ మహేష్ బాబు సూపర్ అనిపించుకున్నాడు. మళ్లీ తన నెంబర్ వన్ స్థానాన్ని నిలుపుకున్నాడు. 2021లో ప్రతి నెలలోనూ మహేష్ బాబు నెంబర్ వన్ గానే కొనసాగాడు. ఓవరాల్ ఇయర్ లో తనే నెంబర్ వన్ అయ్యాడు. గతేడాది సరిలేరు నీకెవ్వరు సినిమాతో సూపర్ డూపర్ హిట్ అందుకున్న మహేష్ బాబు.. ఈ ఏడాది సర్కారు వారి పాటతో జనాల ముందుకు రాబోతున్నాడు. మహేష్ తర్వాత స్థానాన్ని అల్లు అర్జున్ దక్కించుకున్నాడు. గత నెలలో నాలుగో స్థానంలో ఉన్న అల్లు అర్జున్ ఓవరాల్ గా రెండో ప్లేస్ లో నిలిచాడు. ఈ ఏడాది చివరి నెలలో అల్లు అర్జున్ పుష్పగా జనాల ముందుకు వచ్చాడు. ఈ సినిమా పాన్ ఇండియా రేంజి హిట్ గా నిలిచింది.

అటు మూడో స్థానంలో నిలిచాడు ప్రభాస్. ఆయన నటించిన రాధేశ్యామ్, ఆదిపురుష్ సినిమాలు ఈ ఏడాది విడుదలకు రెడీ అవుతున్నాయి. పవన్ కల్యాణ్ నాలుగో స్థానాన్ని దక్కించుకున్నాడు. అటు ఆర్ ఆర్ ఆర్ సినిమాతో జనాలను పలుకరించబోతున్న ఎన్టీఆర్ ఐదో స్థానంలో నిలిచాడు. రాంచరణ్ ఆరో స్థానంలో నిలిచాడు. అటు విజయ్ దేవరకొండ ఏడోస్థానంలో నిలిచాడు. ఆయన ప్రస్తుతం లైగర్ అనే పాన్ ఇండియన్ మూవీ చేస్తున్నాడు. నేచురల్ స్టార్ నాని ఎనిమిదో స్థానంలో నిలువగా చిరంజీవి తొమ్మిదో స్థానంలో ఉన్నాడు. రవితేజ 10వ స్థానంతో సరిపెట్టుకున్నాడు.