నెగెటివ్ క్యారెక్టర్స్ పై ఇంట్రెస్ట్ చూపిస్తున్న టాలీవుడ్ హీరోలు..

ఒకప్పుడు హీరోలు, విలన్లు వేరు వేరుగా ఉండేవారు. ఎవరి పాత్రలు వారు చేసేవారు. నెగెటివిటీ ఏమాత్రం ఉన్నా హీరోలు ఆ పాత్రలు చేసేందుకు ఇష్టపడేవారు కాదు. కానీ ప్రస్తుతం పరిస్థితులు మారిపోయాయి. హీరోలే విలన్లుగా మారుతున్నారు. నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ కావాలని ఫిల్మ్ మేకర్స్ ను కోరుతున్నారు. తాజాగా వచ్చిన పుష్ప సినిమాలో బన్నీ అలాంటి పాత్రే పోషించాడు. వాస్తవానికి బన్నీ ఇందులో ఓ స్మగ్లర్. అంటే కలప దొంగ. అడ్డొచ్చిన రౌడీలతో పాటు పోలీసులను కూడా చంపుతాడు. ఎలాగైన ఎర్రచందనం అక్రమ రవాణి సామ్రాజ్యాన్ని ఏలడమే ఆయన లక్ష్యం. అయినా ఈ సినిమాలో తనే హీరో. సుకుమార్ దర్శకత్వ ప్రతిభ.. అల్లు అర్జున్ నటన.. మొత్తంగా జనాలు బాగానే ఆదరించారు.

అటు పుష్ప దారిలోనే నడుస్తున్నాడు నేచురల్ స్టార్ నాని. దసరా మూవీలో ఆయన కూడా నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేస్తున్నాడు. పుష్ప సినిమాలో బన్నీది గంధపు చెక్కల స్మగ్లింగ్ అయితే.. దసరా సినిమాలో నాని బొగ్గు గనులను తన ఆధిపత్యంలో ఉంచుకుంటాడట. పుష్ప చిత్తూరు యాసలో అదరగొడితే.. నాని తెలంగాణ యాసలో దుమ్మురేపబోతున్నాడట. పుష్పలో బన్నీ మాదిరిగానే.. ఇందులో నాని కూడా మొత్తం లుక్ మార్చేశాడట. జెంటిల్ మెన్, వి సినిమాల్లో మంచి విలన్ గా కనిపించిన నాని.. దసరా సినిమాలో విలనిజం డోస్ కాస్త పెంచినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి బాబితో కలిసి ఓ సినిమా చేస్తున్నాడు. ఇందులో చిరు తొలుత నెగెటివ్ షేడ్స్ ఉన్న అండర్ కాప్ గా కనిపిస్తాడట. ఆ తర్వాత రవితేజతో కలిసి పోసీ అధికారిగా అదరగొడతాడట. అటు వెబ్ సిరీస్ చేస్తున్నాడు అక్కినేని నాగ చైతన్య. ఇందులో ఆయన పాత్ర నెగెటివ్ లక్షణాలను కలిగి ఉంటుందట. అటు రవితేజ రావణాసుర సినిమాలో 10 రోల్స్ లో కనిపిస్తాడట. ఇందులో ఆయన పాత్ర కూడా చాలా నెగెటివ్ గా ఉంటుందట. మరోవైపు కల్యాణ్ రామ్ బింబిసార సినిమాలోనూ నెగెటివ్ పాత్ర చేస్తున్నాడట హీరో.