‘గంటా’ సరికొత్త పొలిటికల్‌ స్టెప్‌

గంటా శ్రీనివాసరావు.. ఎక్కడ అధికారం ఉంటే అక్కడ కనిపించే నాయకుడు.. మొన్న కాంగ్రెస్‌ ప్రభుత్వంలో, నిన్న టీడీపీ గవర్నమెంటులో అధికారం చెలాయించిన వ్యక్తి. ఏ పార్టీకి అధికారం వస్తుందనే విషయాన్ని ముందుగానే అంచనా వేసి వ్యూహాత్మకంగా ఆ పార్టీ కండువా కప్పుకునే అలవాటున్న వ్యక్తి అని పొలిటికల్‌ సర్కిళ్లలో పేరున్న మనిషి. అయితే 2019లో ఆయన అంచనాలు తప్పాయి. తెలుగుదేశం పార్టీ అధికారానికి దూరమైపోయింది. దీంతో రెండేళ్లుగా ఆయన మౌనం వహించారు. ప్రజల్లో‍్ల కూడా పెద్దగా లేరు. ముఖ్య నాయకులు, అనుచరులకు మాత్రమే అందుబాటులో ఉన్నారు. అయితే మరో రెండేళ్లలో ఎన్నికలు సమీపిస్తున్నాయి. మళ్లీ జనంలోకి వెళ్లే సమయం ఆసన్నమైంది. అందుకే పొలిటికల్‌ ప్లాన్స్‌ రూపందిస్తున్నారు.

2024 ఎన్నికలకు గ్రౌండ్‌ ప్రిపేర్‌ చేసుకుంటున్నారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. అందులో భాగమే కాపు కార్డు. ఇటీవల పాయకరావు పేట మండలం గుంటపల్లిలో జరిగిన వంగవీటి రంగా విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడమే ఇందుకు నిదర్శనం. కాపులు త్వరలో అధికార పీఠంపై కూర్చోబోతున్నారని, ఏపీ రాజకీయాల్లో కాపులు కీలకంగా వ్యవహరించనున్నారని ప్రసంగించారు. ఇది జరిగిన అనంతరం హైదరాబాదులో తెలుగు రాష్ట్రాలకు చెందిన కాపు నేతలతో సమావేశం నిర్వహించి భవిష్యత్‌ రాజకీయాలు, తీసుకోవాల్సిన నిర్ణయాలపై చర్చించినట్లు తెలిసింది. ప్రభుత్వంలో కాపులు ఎలాంటి పాత్ర పోషించాలనే విషయంపై మాట్లాడినట్లు సమాచారం. కాపులను ఏకం చేసి కీలక నేతగా మారి చక్రం తిప్పాలని చూస్తున్నట్లు పరిశీలకులు భావిస్తున్నారు. కాంగ్రెస్‌, టీడీపీ ప్రభుత్వాల్లో మంత్రిగా పనిచేసిన అనుభవం ఉండటంతో రెండు పార్టీల్లోనూ ఆయనకు సన్నిహిత సంబంధాలున్నాయి. దీంతో ఇరు పార్టీల్లో ఏం జరుగుతోందో తెలుసుకొని ఆమేరకు నిర్ణయాలు తీసుకుంటున్నారని తెలిసింది. ఇదిలా ఉండగా ప్రస్తుతం తాను ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్న విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి భీమిలికి మారాలని కూడా అనుకుంటున్నట్లు సమాచారం. మరి ఏం జరుగుతుందో చూడాలి.