యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన తాజా చిత్రం `ఆర్ఆర్ఆర్(రౌద్రం రణం రుధిరం)`. ఈ పాన్ ఇండియా చిత్రంలో బాలీవుడ్ భామ అలియా భట్, హాలీవుడ్ బ్యూటీ ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటించగా.. అజయ్ దేవ్గన్, శ్రీయలు కీలక పాత్రలను పోషించారు.
ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 7న భారీ లెవల్లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలోజే ప్రమోషన్స్ షురూ చేసిన మేకర్స్.. నేడు ముంబైలో ప్రీ రిలీజ్ ఫంక్షన్‌ను ఏర్పాటు చేశారు. ముంబైలోని ఫిల్మ్ సిటీలో ఈ ఫంక్షన్ జరగబోతోందని తెలుస్తుండగా.. ఇప్పుడు ఈ ఈవెంట్‌కి అయ్యే ఖర్చు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.
వినిపిస్తున్న తాజా సమాచారం ప్రకారం.. ఈ ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కి గానూ ఆర్ఆర్ఆర్ మేకర్స్ ఏకంగా రూ.10 నుంచి 12 కోట్ల వరకు ఖర్చు పెడుతున్నారట. ఈ మెగా ఈవెంట్‌కి కరణ్ జోహార్ హోస్ట్‌గా వ్యవహరించబోతున్నాడని, అలాగే బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ స్పెషల్ గెస్ట్‌గా హాజరుకాబోతున్నారని బాలీవుడ్లో వార్తలు షికార్లు చేస్తున్నాయి. మరి ఇందులో ఎంత వరకు నిజమో తెలియాల్సి ఉంది.
కాగా, పోరాట యోధులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్‌లు కలిసి బ్రిటిష్ వారిపై ఏవిధంగా పోరాటం చేశారన్న కోణంలో ఫిక్షనల్ స్టోరీగా రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి ఎం. ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. అలాగే ఈ చిత్రంలో కొమరం భీమ్‌గా ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా చరణ్ కనిపించబోతున్నారు.