రానాకు పవన్ ఫ్యాన్స్ అన్యాయం చేస్తారా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ భీమ్లా నాయక్ కోసం ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే. పవన్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ అయిన భీమ్లా నాయక్ పాత్రకు సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్ టీజర్ ఎలాంటి రెస్పాన్స్‌ను అందుకుందో మనం చూశాం. ఈ టీజర్ కొద్ది గంటల్లోనే రికార్డు వ్యూస్‌ను దక్కించుకుని పవన్ స్టామినా ఏమిటో మరోసారి నిరూపించింది.

కాగా ఈ సినిమాలో మరో యంగ్ హీరో రానా దగ్గుబాటి నటిస్తున్న సంగతి తెలిసిందే. డానియల్ శేఖర్ అనే పాత్రలో భీమ్లా నాయక్‌ను ఢీకొనే వ్యక్తిగా రానా దగ్గుబాటి కనిపించబోతున్నాడు. ఇక ఈ సినిమాలో ఆయన పాత్ర కూడా చాలా పవర్‌ఫుల్‌గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ పాత్రకు సంబంధించిన టీజర్ గ్లింప్స్‌ను ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారా అని ఆసక్తిగా చూస్తున్నారు. అయితే రానా పాత్రకు సంబంధించిన టీజర్ రిలీజ్ అనౌన్స్‌మెంట్‌ను ఈరోజు సాయంత్రం 4.05 గంటలకు చేయనుంది చిత్ర యూనిట్.

ఇక ఈ టీజర్ గ్లింప్స్‌కు కూడా భీమ్లా నాయక్ టీజర్ గ్లింప్స్ తరహా వ్యూస్ రావడం ఖాయమని చిత్ర వర్గాలు అంటున్నాయి. అయితే పవన్ ఫ్యాన్స్ మాత్రం తమ హీరో స్థాయిని మరే ఇతర హీరో టచ్ కూడా చేయొద్దని చూస్తుంటారు. ఈ క్రమంలో రానా పాత్రకు సంబంధించిన టీజర్‌కు వారు అన్యాయం చేస్తారా అనే ప్రశ్న ప్రస్తుతం ఫిలిం నగర్ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది.