చేతినిండా సినిమాలే.. అయినా హీరోయిజం కోసం పాకులాడని ఏకైక స్టార్ హీరో …ఎవరంటే..!

ఆ నటుడు అంత కలర్ ఏమీ ఉండడు. బ్యాగ్రౌండ్ కూడా లేదు. కానీ ఇప్పుడు ఆయన సౌత్ ఇండియాలో బిగ్గెస్ట్ హీరో. ఆయనకు పాత్ర నచ్చిందంటే చాలు చిన్న సినిమానా..చిన్న డైరెక్టరా..అని ఆలోచించడు. భాషతో సంబంధం ఉండదు.. టాలీవుడ్ అయినా..కోలీవుడ్ అయినా.. నటించేస్తుంటాడు. ఆయన ఎవరో కాదు మక్కన్ సెల్వం విజయ్ సేతుపతి.ఆయనకు భాషలతో సంబంధం లేకుండా అన్ని చోట్ల ఫ్యాన్స్ ఉన్నారంటే అతిశయోక్తి కాదు.

సేతుపతి నటించిన సినిమాలు వారానికి రెండు విడుదల అవుతుంటాయి. ఆయన స్టార్ హీరో అయినా..భారీ చిత్రాల్లో నటించాలని గిరిగీసుకుని కూర్చోలేదు. పాత్ర నచ్చితే హీరోగానే కాదు.. విలన్ గా.. క్యారెక్టర్ ఆర్టిస్టుగా.. హీరోయిన్ కు తండ్రిగా కూడా నటిస్తుంటాడు.మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన నవాబ్ సినిమాలో అరవిందస్వామి, శింబు హీరోలుగా నటించగా.. విజయ్ సేతుపతి చిన్న పాత్రలో నటించాడు. నిజానికి వారిద్దరి కంటే సేతుపతికే ఇమేజ్ ఎక్కువగా ఉంది. కానీ పాత్ర నచ్చడం వల్లే ఆ సినిమాలో సేతుపతి నటించాడు. ఇటీవల తమిళ స్టార్ హీరో విజయ్ మాస్టర్ సినిమాలో హీరోకు ఏ మాత్రం తీసుపోనీ విలన్ పాత్రల్లో నటించి ఔరా అనిపించాడు.

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన సైరా సినిమాలో సేతుపతి నిమిషాల నిడివి ఉన్న పాత్రలో నటించి మెప్పించాడు. ఉప్పెన సినిమాలో అయితే ఏకంగా హీరోయిన్ తండ్రిగా నటించాడు. ఆ సినిమాలో నటించేటప్పటికి సేతుపతి వయస్సు 42 మాత్రమే. కొందరు హీరోలు వయసు 40 దాటినా ఇంకా లవర్ బాయ్ గా కనిపించాలని.. హీరోయిజం ఉన్న పాత్రలే కావాలని.. ఎలివేషన్ సీన్స్ అదిరి పోవాలని.. పరితపిస్తుంటారు.కానీ సేతుపతి మాత్రం కథలో తన పాత్ర ప్రాధాన్యం గురించి మాత్రమే ఆలోచిస్తూ ఉంటాడు.

తమిళంలో దెయ్యాల సినిమాల స్పెషలిస్ట్ గా గుర్తింపు పొందిన డైరెక్టర్ మిషికన్ ప్రస్తుతం పిశాచు -2 అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇటీవల ఈ సినిమా కథ విన్న సేతుపతి ఇందులో తనకు ఓ పాత్ర కావాలని దర్శకుడిని రిక్వెస్ట్ చేశాడు. మీ స్థాయికి తగ్గ పాత్ర ఇందులో లేదని దర్శకుడు చెప్పినా సేతుపతి వినలేదు. నిడివి తక్కువగా ఉన్నా సరే తనకు నచ్చిన ఓ పాత్రలో నటిస్తానని దర్శకుడికి చెప్పి ఒప్పించాడు. ప్రస్తుతం పిశాచు-2 మూవీ రెగ్యులర్ షూటింగ్ జరుగుతోంది. ఎంతో టాలెంట్ ఉండి.. స్టార్డమ్ ఉన్న విజయ్ సేతుపతి ఒక చిన్న పాత్ర చేస్తా.. అని అడిగి మరీ నటించడంపై డైరెక్టర్ మిషికన్ సంతోషం వ్యక్తం చేశాడు.