సోషల్ మీడియా పుణ్యమా అని ఈ మధ్య కాలంలో మోడల్స్, హీరోయిన్స్ ఫొటో షూట్లకు తెగ అలవాటు పడిపోయారు. సమయం దొరికితే చాలు.. ఫొటో షూట్లు నిర్వహిస్తూ అందుకు సంబంధించిన పిక్స్‌ను నెట్టింట పెట్టేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ మోడర్ కమ్ హీరోయిన్ ఫొటో షూట్ పేరుతో ప్రాణాలకు మీదకు తెచ్చుకుని హాస్పటల్ పాలైంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
తూర్పు జర్మనీ సాక్సోనీ అన్హాల్ట్ రాష్ట్రంలో నెబ్రా అనే ప్రైవేట్ స్థలంలో ఓ వ్యక్తి జంతువుల ప్రదర్శన కోసం రిటైర్మెంట్ హోంను నడిపిస్తున్నాడు. అయితే జర్మనీకి చెందిన జెస్సికా లీడోల్ఫ్ (36) అనే మోడల్ చిరుతలతో ఫొటోలు దిగాలనుకుంది. ఇందులో భాగంగానే ట్రాయ్, పారిస్ అనే రెండు చిరుతలు ఉన్న బోనులోకి వెళ్లిన జెస్సికా ఫొటోషూట్ ప్రారంభించింది.
అయితే ఫొటోలు దిగుతుండగా..ఆ రెండు చిరుతలు ఆమె పై ఒక్కసారిగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. ఇక ఈ ప్రమాదం జరిగిన వెంటనే ఆమెను హెలికాప్టర్ ద్వారా ఆసుపత్రికి తరలించగా వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అక్కడే ఆమె తలకు సర్జరీ చేశారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపిన వైద్యులు.. ఆమె ముఖంపై, తలపై శాశ్వత చిరుత దాడి మచ్చలు ఉండిపోతాయని పేర్కొన్నారు.