రెండు గంట‌ల‌కే చార్మీ ఉక్కిరి బిక్కిరి..ఆధారాల‌తో సిట్‌

టాలీవుడ్‌ను కుదిపేసిన డ్ర‌గ్స్ కేసులో రోజుకో సంచ‌ల‌నం వెలుగు చూస్తోంది. ఇక తాజాగా ఈ రోజు సిట్ ప్ర‌ముఖ హీరోయిన్ చార్మీని విచారిస్తోంది. ఇక విచార‌ణ తీరును త‌ప్పుప‌డుతూ చార్మీ హైకోర్టును ఆశ్ర‌యించిన సంగ‌తి తెలిసిందే. విచార‌ణ‌లో బ‌ల‌వంతంగా ర‌క్త సేక‌ర‌ణ‌, జుట్టు, గోళ్లు క‌త్తిరిస్తున్నారని, విచార‌ణ మొత్తం బెదిరింపుల‌తోనే న‌డుస్తోంద‌ని ఆమె త‌న పిటిష‌న్‌లో పేర్కొన్నారు.

సిట్ అధికారులు ఎవ్వ‌రి ఒత్తిళ్ల‌ను లెక్క చేయకుండా విచారిస్తోన్న టైంలో చార్మీ డేర్ చేసి హైకోర్టులో పిటిష‌న్ వేయ‌డం పెద్ద సంచ‌ల‌నంగా మారింది. దీంతో బుధ‌వారం చార్మీ విచార‌ణ ఎలా ఉంటుందా ? అన్న ఆస‌క్తి అంద‌రిలోను నెల‌కొంది. ఇక సిట్ ప‌క్కా ఆధారాల‌తో చార్మీని విచారిస్తుండ‌డంతో ఆమె తొలి రెండు గంట‌ల‌కే ఉక్కిరి బిక్కిరి అయిన‌ట్టు తెలుస్తోంది.

కెల్విన్ మీకు ఎలా పరిచయమని అడుగగా, ఈవెంట్ మేనేజర్ గా మాత్రమే తెలుసునని చార్మి చెప్పినట్టు సమాచారం. జ్యోతిలక్ష్మి సినిమా ప్రమోషన్ లో భాగంగా అతను తెలుసునని, ఆపై ఇంకెప్పుడూ కలవలేదని చార్మి వెల్లడించింద‌ట‌. ఇక కెల్విన్‌తో చార్మీ చాట్ చేసిన ఆధారాల‌ను సిట్ బ‌య‌ట పెట్ట‌డంతో ఆమె త‌డ‌బ‌డుతూ స‌మాధానాలు ఇచ్చిన‌ట్టు విశ్వ‌స‌నీయ‌వ‌ర్గాల ద్వారా తెలుస్తోంది.

విచార‌ణ‌కు చార్మీ ఎంత ప‌క్కాగా వ‌చ్చినా సిట్ అంత‌కు మించిన ఎత్తులు వేయ‌డంతో ఆమె షాక్ అయ్యింద‌ని స‌మాచారం. ఇక సిట్ చేతిలో చార్మీ గురించి ప‌క్కా ఆధారాలు ఉన్న విష‌యం ఆమెకు ముందుగానే తెలియ‌డంతో విచారణ పట్ల చాలా ఆందోళనతో ఉన్నట్టుగా మూడు, నాలుగు రోజుల నుంచి జరుగుతున్న ఘటనలు వెల్లడిస్తున్నాయి.