సూపర్‌ స్టార్‌పై ఫన్నీ కంప్లయింట్‌

వెండితెరపై హీరోలు చేసే యాక్షన్‌ సీన్స్‌ చూసి అభిమానులు థ్రిల్లవుతారు. అభిమానుల్ని అలరించడానికి హీరోలు ఎంత సాహసానికైనా వెనుకాడరు. ఆ సాహసంలో వారికి ఆనందం కనిపిస్తుంటుంది. అభిమానులు ఆ సీన్స్‌ చూసి ఎలా థ్రిల్లవుతారో ఊహించుకుని, ఆ ఉత్సాహంతో సాహసాలు చేసేస్తారు. కానీ అలాంటి సాహసాలు కూడా అభిమానులకు ఆవేదన కలిగిస్తాయా? ఇదిగో, ఈ వ్యక్తి గురించి వింటే అది నిజమనిపిస్తుంది.

తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ ‘కబాలి’ సినిమా కోసం చాలా సాహసాలు చేశాడు. ఆ వయసులో ఆయన్ని అంత కష్టపెట్టడం తనకు బాధ కలిగించిందంటూ ఓ అభిమాని (పేరు కందసామి) పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రజనీకాంత్‌ని వృద్ధాశ్రమంలో చేర్చాల్సిందిగా ఆ ఫిర్యాదులో పేర్కొన్నాడు. ప్రభుత్వం వృద్ధుల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని, వారి పట్ల ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటోంటే వారిని కష్టపెట్టడం సబబు కాదని ఆయనగారు చెప్పారు.

హాస్యాస్పదంగా ఉంది కదా? రజనీకాంత్‌ పట్ల వ్యతిరేకతతో అభిమాని అనే ముసుగులో ఆ వ్యక్తి ఇలా పోలీసులకు ఫిర్యాదు చేశాడని అభిమానులు తేల్చారు. ఇలాంటి కేసులు నవ్వు తెప్పిస్తాయి, అలాగే సెలబ్రిటీలకు చికాకు కలిగిస్తాయి. సినీ చరిత్రలోనే ఇదో ఫన్నీయస్ట్‌ కంప్లయింట్‌గా మారింది.