వెండితెరపై చంద్రబాబు!

పొలిటికల్‌ స్టార్‌ వెండితెర స్టార్‌ అయ్యేలాగున్నారు. చంద్రబాబు నటిస్తారో నటించరోగానీ ఆయన మీద ఓ సినిమా రూపొందుతోంది. టిడిపి నాయకులే ఈ సినిమాని రూపొందించడానికి ముందుకు వచ్చారు. విజయవాడకు చెందిన మల్లికార్జున యాదవ్‌ కార్పొరేటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనే ఈ చిత్రానికి నిర్మాత. ‘చంద్రోదయం’ పేరుతో రెండేళ్ళ చంద్రబాబు పాలనలోని విజయాల్ని ప్రజలకు చేరేవేసేందుకు ఈ చిత్రాన్ని తీయనున్నారట.

ఎపి టిడిపి ముఖ్య నాయకుల్లో ఒకరైన హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఈ చిత్ర షూటింగ్‌ని ప్రారంభిస్తారు. పసుపులేటి వెంకట్‌ అనే దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. ఆగస్ట్‌ 4న సినిమా షూటింగ్‌ ప్రారంభం కానున్నట్లుగా సమాచారమ్‌. చంద్రబాబుతోపాటు ఈ చిత్రంలో లోకేష్‌ కూడా నటించే అవకాశం ఉందని, ఓ ముఖ్య పాత్రలో బాలకృష్ణ కూడా నటిస్తారని తెలియవస్తోంది.

అయితే చంద్రబాబు వేషధారణలో ఓ వ్యక్తి నటించడం తప్ప చంద్రబాబు ఈ సినిమాలో నటించకపోవచ్చని కూడా అంటున్నారు. ఈ సినిమా ప్రారంభోత్సవానికి చంద్రబాబుని కూడా ఆహ్వానించినప్పటికీ ఆయన సుముఖత వ్యక్తం చేయలదట. బాలకృష్ణ మాత్రం సినిమా ప్రారంభోత్సవానికి హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలియవస్తోంది.