‘ధ్రువ’లో రాంచరణ్ లుక్ అదుర్స్

తమిళంలో సూపర్‌హిట్‌ ‘తని ఒరువన్’ తెలుగు రీమేక్ జోరుగా సాగిపోతోంది. లీడ్‌ రోల్‌ పోషిస్తున్న రామ్‌ చరణ్ పోలీసాఫీసర్‌గా అలరించనున్నారు. పాత్ర కోసం ఆయన ప్రత్యేక శ్రద్ధే తీసుకున్నారు. డైట్‌ కూడా మార్చినట్లు సమాచారం. ఈ సినిమాలో చరణ్ గెటప్ ఎలా ఉంటుందో తెలీలేదు. తాజాగా ఈ సంగతీ బయటకొచ్చేసింది.

‘ధ్రువ’లో చరణ్‌కు సంబంధించిన ఓ లుక్‌ సోషల్‌మీడియాలో హల్‌చల్ చేస్తోంది. చెర్రీ పోలీస్‌ యూనిఫామ్‌లో మాంఛి ఎనర్జిటిక్‌గా ఉన్నారు. ఈ ఫొటోను నవదీప్‌ సోషల్‌మీడియాలో పెట్టాడట. సెట్స్‌లో సరదాగా తీసుకున్న సెల్ఫీని అభిమానులతో షేర్‌ చేసుకుంటూ చరణ్‌ను బెస్ట్‌ కో-స్టార్‌గా పొగిడేశాడు. ‘ధ్రువ’ మూవీలో చరణ్‌కు సంబంధించినంత వరకూ బయటకు వచ్చిన తొలి ఫొటో ఇదే. రకుల్‌ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని గీతాఆర్ట్స్‌ పతాకంపై అల్లు అరవింద్‌ నిర్మిస్తున్నారు. దసరాకి ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.